అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం మాటేంటో గానీ భారత్‌కు మాత్రం కలిసి రానట్టే కనిపిస్తోంది. ఆయన బాధ్యతలను స్వీకరించిన మరుసటి రోజే దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఏకంగా 5.5 లక్షల రూపాయలు హరించుకుపోయాయి. నష్టాలతో దలాల్ స్ట్రీట్ దడదడలాడింది. ఈ ఉదయం బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నష్టాలతో ఆరంభం అయ్యాయి. సోమవారం సాయంత్రం నాటికి ముగిసిన ట్రేడింగ్‌తో పోల్చుకుంటే ప్రారంభంలోనే 110.61 పాయింట్లను నష్టపోయింది సెన్సెక్స్. ఆ తరువాత కోలుకోలేకపోయింది. క్రమంగా గ్రాఫ్ నేల చూపులు చూస్తూ మరింత దిగజారింది. ఒక దశలో తొలి రెండు గంటల్లో 800 పాయింట్ల మేర నష్టపోయిందంటే సెన్సెక్స్ పతనం వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత కొద్దిగా కోలుకుంది. 100 పాయింట్ల మేర రికవరీ అయింది గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా అయిదున్నర లక్షల కోట్ల రూపాయలు హుష్ కాకి అయ్యాయి.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ పూర్తిగా కోలుకుంది.. గానీ నిలకడ లోపించింది. మరో అరగంటకే మళ్లీ దిగజారింది. సుమారు 900 పాయింట్ల వరకు పడిపోయింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి 869.16 పాయింట్లను నష్టపోయింది. 76,168.52 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ కావడం కనిపించింది. ఐటీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, స్టీల్.. సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్ల పతనం నేడు కూడా కంటిన్యూ అయింది.