అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే తన దేశంలో అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ పనిలో పనిగా తన దేశానికి పనికొచ్చేలా ఈ వ్యవహారాన్ని మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వలసదారుల గుర్తింపు, అరెస్టులు, స్వదేశాలకు తమ విమానాల్లోనే తరలింపులు చేపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఆయా దేశాల ముందు పలు ఆఫర్లు పెడుతున్నారు. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా మరో ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశారు. అమెరికా రక్షణ సామాగ్రిని ఇప్పటికే భారీగా కొనుగోలు చేస్తున్న భారత్.. ఇప్పుడు ట్రంప్ షరతుతో దాన్ని మరింత పెంచాల్సిన పరిస్ధితి ఎదురు కాబోతోంది.
ఈ మేరకు తమ రక్షణ సామాగ్రి కొనుగోళ్లతో భారతీయ వలసల బహిష్కరణకు ట్రంప్ లింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో మోడీ-ట్రంప్ చర్చల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. వీరిద్దరి చర్చల తర్వాత అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లపై భారత్ నుంచి వచ్చే ప్రకటనను బట్టి వలసలపై నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. మరి భారత్ తమ వలసల కోసం అమెరికా రక్షణ సామాగ్రి కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

గతేడాది జూన్ లో వెలువడిన లెక్కల ప్రకారం భారత్ నుంచి అమెరికాలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య 54 లక్షలుగా తేలింది. వీరిలో అక్రమ వలసదారులు కూడా ఉన్నారు. వీరి సంఖ్య ఎంతో నిర్దిష్టంగా తేల్చేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నుంచి అమెరికా వచ్చి అక్రమంగా వలసదారులుగా ఉన్న వారిని బహిష్కరించడం ఖాయమన్న సంకేతాలను మాత్రం ట్రంప్ సర్కార్ ఇచ్చేసింది. దీంతో ఇప్పటికే భారత్ గుర్తించిన తమ అక్రమ వలసల్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలి విడతలో 18 వేల మందిని వెనక్కి తెస్తామని విదేశాంగమంత్రి జైశంకర్ ఇప్పటికే ప్రకటించారు.
ఇలాంటి సమయంలో ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఫోన్ కాల్ చేశారు. ఇందులో మీ అక్రమ వలసలను వెనక్కి పిలిపిస్తారా లేక మమ్మల్నే తరిమేయమంటారా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని మోడీ ఫిబ్రవరిలో అమెరికా వచ్చి ట్రంప్ తో భేటీ అవుతారని వెల్లడించింది. అలాగే మోడీకి ట్రంప్ పెట్టిన షరతుపై కూడా సంకేతాలు ఇచ్చేసింది.