అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) సర్కార్ మరోసారి విదేశీ విద్యార్థులపై వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) వంటి ప్రముఖ విద్యా సంస్థలకు విదేశీ విద్యార్థులను చేర్చుకోవద్దని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిబంధనలు విధించింది. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికేషన్ రద్దు చేస్తూ అధికారిక లేఖను పంపారు. ఇది ఆ యూనివర్సిటీలో ఇప్పటికే చదువుతున్న వేలాదిమంది అంతర్జాతీయ విద్యార్థులకు ఊహించని విధంగా తీవ్ర కలవరం కలిగించింది.
ఫెడరల్ అనుమతిని రద్దు
ఈ కొత్త నిబంధనల ప్రకారం, హార్వర్డ్ వర్సిటీకి ఇప్పటి వరకూ ఉన్న ఫెడరల్ అనుమతిని రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే, ఇకపై హార్వర్డ్ వర్సిటీ కొత్తగా విదేశీ విద్యార్థులను అంగీకరించలేరు. ఇప్పటికే అక్కడ చదువుతున్నవారికి తప్పకుండా వేరే వర్సిటీలకు బదిలీ కావాలని, లేకపోతే వారు తమ విద్యా వీసా ద్వారా పొందిన చట్టబద్ధ హోదాను కోల్పోతారని హెచ్చరించారు. ఇది వారి చదువు, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.
విద్యా స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే అంశం
ఈ నిర్ణయం విద్యారంగంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రపంచంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్‌పై ఇలాంటి చర్య తీసుకోవడం అనేది విద్యా స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే అంశంగా పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, ఈ నిర్ణయం అమెరికాలోని వర్సిటీలకు చేరే అంతర్జాతీయ విద్యార్థులపై మానసిక భయాన్ని కలిగించేలా ఉందని విమర్శిస్తున్నారు. ప్రపంచ విద్యా రంగంలో అమెరికా యొక్క నమ్మకాన్ని ఈ చర్య బలహీనపరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Kamal Haasan : కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో థగ్ లైఫ్