Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచి ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై దృష్టిపెట్టారు. అందులోభాగంగా విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల కోతలు పెడుతోన్న ఆయన.. ప్రస్తుతం దానిని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉదారవాద భావజాలంతో విద్యాశాఖ కలుషితమైందని ఆయన భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.

అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా అసాధ్యమే
విద్యాశాఖను మూసివేయడానికి, ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో అమెరికా ప్రజలకు అందుతోన్న సేవల్లో అంతరాయం లేకుండా చూసుకోవాలి అని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్‌ను ఉద్దేశిస్తూ ఉన్న వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌ను అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది. అయితే అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా దానిని మూసివేయడం దాదాపు అసాధ్యమే. అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే.
విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు
దానిలోభాగంగా ఆ శాఖలో లోని సిబ్బందిలో సగం మందిని తొలగించే ప్రయత్నాల్లో ఉన్నామని గతంలో ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ మంత్రిగా లిండా మెక్‌మాన్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఆ పని మొదలుపెట్టారు. ట్రంప్ నాకు ఇచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. విద్యాశాఖను మూసివేసేందుకు మేం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని తెలుసు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అవసరానికి మించి ఉన్నవారిపై కత్తెరవేయడం కిందికే వస్తుంది అని లిండా ఇటీవల పేర్కొన్నారు. విద్యాశాఖను తొలగించి, దానిని రాష్ట్రాలకు అప్పగిస్తానని చెప్పారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీవిరమణ చేయడానికి ముందుకొచ్చారు.