అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం(Donald Trump’s Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా మాదక ద్రవ్యాల రవాణాలో పాలుపంచుకున్న భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, వారి కుటుంబ సభ్యుల వీసాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఫెంటనిల్ వంటి సింథటిక్ డ్రగ్స్‌పై ఆంక్షలు విధించడం, అక్రమ రవాణా అడ్డుకోవడం ద్వారా తమ పౌరుల ప్రాణాలను రక్షించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఇది ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన మత్తుపదార్థాల వ్యతిరేక పోరాటంలో భాగమని రాయబార కార్యాలయం పేర్కొంది.

ఫెంటనిల్ అనేది అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ ఓపియాయిడ్. ఇది హెరోయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైనదిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఫెంటనిల్ కారణంగా ఓవర్‌డోస్ మరణాలు అధికంగా చోటుచేసుకోవడంతో, దీనిని అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ డ్రగ్ తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు భారత్ నుంచి అక్రమంగా సరఫరా అవుతున్నాయనే ఆరోపణలను అమెరికా గతంలోనే చేసింది. అందువల్ల ఈ నిర్ణయం భారతీయ కంపెనీలపై నేరుగా ఒత్తిడి తేవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో మత్తుపదార్థాల వ్యాపారాన్ని అరికట్టే కఠిన చర్యగా భావించబడుతోంది.
ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా రాయబారి ప్రతినిధి జోర్గన్ ఆండ్రూస్ మాట్లాడుతూ, “మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో యూఎస్ ఎంబసీ కట్టుబడి ఉంది. ఇలాంటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వ్యక్తులు, సంస్థలు, వారి కుటుంబాలు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటాం” అని హెచ్చరించారు. అమెరికా–భారత్ ప్రభుత్వాలు ఈ అంతర్జాతీయ ముప్పును ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయనున్నాయని తెలిపారు. అయితే ఈ కేసులో నిందితుల వివరాలు ఇంకా బయటకు రాలేదు. భారత ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉండటంతో, ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య కీలక దౌత్య చర్చలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.