డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార ప్రముఖులు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. కార్యక్రమానికి భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం విశేషం. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ట్రంప్ తన ప్రసంగంలో “అమెరికా ఫస్ట్” అనేది తన ప్రధాన నినాదమని స్పష్టం చేశారు. “మా దేశం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని మళ్లీ బలంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా మన శక్తిని ప్రపంచానికి చాటాలి” అని ఆయన అన్నారు. సరిహద్దుల రక్షణను మరింత కఠినంగా చేపట్టడం, శాంతి భద్రతల విషయంలో శక్తివంతమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రాధాన్యంగా పేర్కొన్నారు.
సరిహద్దుల రక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తామని ట్రంప్ వెల్లడించారు. దేశ సరిహద్దులను రక్షించడం, అక్రమ వలసలను అరికట్టడం ఆయన ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. అమెరికా ప్రజల భద్రత, శాంతి, ఐక్యత కోసం మరింత సమర్థంగా పని చేస్తామన్నారు. విద్యా వ్యవస్థలో మెరుగులు దిద్దడం ఆయన ప్రణాళికలో కీలక భాగమని ట్రంప్ తెలిపారు. అమెరికా యువత భవిష్యత్తు కోసం అనేక సంస్కరణలు చేపడతామన్నారు. విద్యా వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు, విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించడం తన ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా తీసుకుంటుందని ట్రంప్ అన్నారు.
అమెరికా పేరుప్రఖ్యాతులు నిలబెట్టడంలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు. దేశ అభివృద్ధికి ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. “అమెరికా ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలవాలి. అందుకు ప్రతి ఒక్కరూ తమ కృషితో తోడ్పాటునివ్వాలి” అని ట్రంప్ తన ప్రసంగం ద్వారా ఉద్దేశించారు.