తెలుగు సినీ సాహిత్యంలో అమరమైన పేరు – సిరివెన్నెల సీతారామ శాస్త్రి
తెలుగు రాష్ట్రాల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే పేరు తెలియని వారుండరంటే అది అతిశయోక్తి కాదు. ఆయన రచనల ప్రభావం తెలుగు భాషను ప్రేమించే ప్రతి ఒక్కరిపై కనిపిస్తుంది. ఆయన పాటలు వినిపించిన ప్రతీసారీ మన హృదయాన్ని తాకకమానవు. సిరివెన్నెల భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన కలం నుంచి జాలువారిన పదాలు తెలుగు భాషలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ప్రేమ కవిత్వం నుంచి చైతన్య గీతాలు, ఐటెం సాంగ్స్ నుంచి భావోద్వేగభరితమైన పాటలు వరకు ఎన్నో కోణాల్లో తన ప్రతిభను చాటిన కవి.
‘విధాత తలపున’ – ఓ మారుమూల భావన
సిరివెన్నెల సినీ రచయితగా తన దిశను మార్చుకున్న మలుపు ‘విధాత తలపున’ అనే పాటతో మొదలైంది. ఈ పాట తనపై ఎంతటి ప్రభావం చూపిందో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వివరిస్తూ, అది తన జీవితానికే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు తాను ఈ పాట విని, తెలుగులో కూడా ‘డిక్షనరీ’ ఉండొచ్చనే నిజాన్ని తెలుసుకున్నానని చెబుతారు. “తెలుగు పదాలకు అర్థాలు తెలుసుకోవడం మొదలైనది ఈ పాట విన్న తర్వాతే” అని త్రివిక్రమ్ చెప్పారు. ఈ పాట వల్లే సిరివెన్నెల రచనలు తన మనసులో స్థానం సంపాదించుకున్నాయని గుర్తుచేశారు.
కమర్షియల్ పాటలతో ఉన్న అంతరాత్మ పోరాటం
అంత శుద్ధత ఉన్న పాటలు రాసిన కవి, ఆ తర్వాత కమర్షియల్ పాటల్ని రాయడంలో తడబడటం సహజమే. సీతారామ శాస్త్రి కూడా ఆ దశను ఎదుర్కొన్నారు. కమర్షియల్ పాటలు రాయాలా వద్దా అన్న సందిగ్ధంలో ఒకానొక సమయంలో పరిశ్రమను విడిచి వెళ్లిపోవాలనే ఆలోచన కూడా వచ్చిందట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా వెల్లడిస్తూ, “ఆయనలోని కవిత్వం, కమర్షియల్ డిమాండ్స్ మధ్య ఒక క్లాష్ ఏర్పడింది” అన్నారు. కానీ తన విలువలను తగ్గించకుండా, ప్రతిసారి సాహిత్య పరంగా అద్భుతంగా నిలిచారు.

ట్రెండ్ సెట్టర్‌గా సిరివెన్నెల
“సిరివెన్నెల హై లెవెల్ సాంగ్స్ మాత్రమే రాస్తారేమో అనుకున్నాం. కానీ శివ సినిమాలో ‘బోటనీ పాఠముంది’ పాట, మనీ సినిమాలోని పాటలు చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోయింది,” అని త్రివిక్రమ్ వివరించారు. ఆయన పాటలు సినీ సాహిత్యాన్ని పూర్తిగా మలుపు తిప్పిన ఘట్టాలుగా నిలిచాయన్నారు. “మనీ సినిమా తర్వాత తెలుగు సినీ రచనలో కొత్త ట్రెండ్ ఏర్పడింది. కొత్తగా రచనలు చేయాలనుకునే వారందరికీ ఇది ప్రేరణ అయింది” అన్నారు.
కవిత్వ స్థాయిని కాపాడిన గొప్ప రచయిత
ఒక కవి స్థాయిని దిగిపెట్టే రెండు పాటలు అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్, ఐటెం సాంగ్ అని త్రివిక్రమ్ అభిప్రాయపడుతున్నారు. కానీ అటువంటి పాటల్లో కూడా సిరివెన్నెల తన డిగ్నిటీని నిలబెట్టుకున్నారు. “అతను ఐటెం సాంగ్స్ కూడా తనదైన శైలిలో రాసేవారు. ఎక్కడా తన స్థాయిని తగ్గించుకోలేదు. ఇది ఆయన వ్యక్తిత్వం, ఆయన ఏర్పరుచుకున్న అంతరంగిక నియమాలు” అని వెల్లడించారు.
Read also: HIT 3: ‘హిట్-3’ బ్లాక్ బస్టర్ రూ.100 కోట్లు దాటిన కలెక్షన్స్