జమ్మూ కాశ్మీర్ మళ్లీ భయంతో నలుగుతుంది. పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. పర్యాటకులతో నిండిన పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు విచక్షణ లేకుండా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మృతుల్లో కొందరు విదేశీయులున్నారని సమాచారం.దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో బైసరన్ మైదాన ప్రాంతం Tuesday మధ్యాహ్నం ఈ దారుణ ఘటనకు వేదిక అయింది. పర్యాటకులు ప్రశాంతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది అక్కడికక్కడే మృతి చెందారు.
బాధ్యతను ఒప్పుకున్న TRF ఉగ్ర సంస్థ
ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్ ప్రేరేపితంగా పనిచేస్తున్న ఈ సంస్థ, 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా (LeT)కు అనుబంధంగా TRF పనిచేస్తోందని నిఘా సంస్థలు భావిస్తున్నాయి.ఈ సంస్థ ప్రధానంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు స్థానిక మద్దతు సమకూర్చడమే లక్ష్యంగా ఏర్పడిందని సమాచారం. TRF తరచూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.
మృతుల్లో విదేశీయులూ ఉన్నట్టు సమాచారం
పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారిలో కొంతమంది విదేశీయులున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారు వేసవి సెలవుల కోసం పహల్గామ్‌ను సందర్శించారని సమాచారం. ఈ ఘటన దేశీయంగా కాదు, అంతర్జాతీయంగా కూడా కాశ్మీర్‌లో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.ఈ దాడికి స్పందనగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కాశ్మీర్‌లో మోహరించబడ్డాయి. అనంత్‌నాగ్ జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ, CRPF సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఇది ముందుగా పథకం వేసిన ఉగ్ర దాడి. దీనికి వెనుక ఉన్న వారిని బహిర్గతం చేసి, కఠినంగా శిక్షిస్తాం,” అని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఆవేదన, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువ
ఈ దాడిపై సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండించారు. పర్యాటకులు లక్ష్యంగా చేసుకోవడం అత్యంత దారుణమని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనతో పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే కాశ్మీర్‌కు వచ్చే పర్యాటకుల్లో భయం నెలకొంది. పహల్గామ్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి నిశ్చలంగా మారిపోయింది.
Read Also : Mamata Banerjee : మమతా బెనర్జీ నివాసానికి సమీపంలో ఉద్రిక్తత..