అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ప్రధానంగా మెక్సికో వంటి దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన లక్షణ మంది ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 1.4 కోట్ల మంది చట్టపరమైన డాక్యుమెంట్లు లేని ఇమ్మిగ్రెంట్లు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 7.25 లక్షల మంది భారతీయ పౌరులు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి వారిని ఏరిఏరి వారి దేశాలకు పంపించే పనిలో ట్రంప్ ప్రస్తుతం ఉన్నారు. అక్రమ వలసలను అడ్డుకోవటానికి ట్రంప్ సర్కార్ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశం ఉండటంతో లక్షల మందిలో ఆందోళనలు మెుదలయ్యాయి. అలాగే అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మాణ పనులు సైతం వేగవంతంగా కొనసాగుతున్నాయి.

2024లో Pew రీసెర్చ్ అందించిన రిపోర్టు ప్రకారం అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిలో భారతీయులు మూడవ అతిపెద్ద సమూహంగా ఉన్నట్లు వెల్లడైంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాదాపు 192 దేశాలకు చెందిన 2,70,000 మంది అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులను వారి దేశాలకు డిపోర్ట్ చేసింది. అయితే వీరిలో భారతీయులు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం పగ్గాలు మారితన తర్వాత ట్రంప్ అమెరికన్లకు ప్రాధాన్యత పెంచాలని, అమెరికాను ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తిరిగి మార్చాలని భావిస్తున్న వేళ అక్రమంగా అమెరికాలో నివశిస్తున్న ప్రజలను డిపోర్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.