మండల అధ్యక్షులకు దిశానిర్దేశం
హైదరాబాద్: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాల (ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్) మండల అధ్యక్షులతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.

ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాల భర్తీ
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కేడర్‌ను సమాయత్తం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, భవిష్యత్‌లో ఖాళీగా ఉన్న మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని వివరించాలని సూచించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పట్టభద్రుల్లో,ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో పార్టీ పట్ల నెలకొన్న సానుకూలతను తమకు అనుకూలంగా మల్చుకోవాలని స్పష్టంచేశారు.
మార్చి 20 న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు
కాగా, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 3 న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 20 న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు ఉండనున్నాయి. అయితే ఇందులో ఏ పార్టీకి ఎన్ని దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్‌ల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. దీంతో ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.