हिन्दी | Epaper

War: భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

Vanipushpa
War: భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

పశ్చిమాసియాలో నెలకొన్న ఇజ్రాయెల్, అమెరికా-Iran మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం మీద ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లే సరుకుల రవాణా మార్గాలు ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా, అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు సంప్రదాయ సముద్ర మార్గాలను ఉపయోగించడానికి వెనుకాడుతున్నాయి. దీని వల్ల భారత ఎగుమతులు ఇప్పుడు దీర్ఘమైన, ఖర్చుతో కూడిన మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. సాధారణంగా భారత్-యూరప్ మధ్య సరుకులు రెడ్ సీ, సూయెజ్ (Red Sea, Suez) కాలువ మార్గం గుండా ప్రయాణిస్తాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో, దాడుల ముప్పు ఉందనే అంచనాతో అనేక షిప్పింగ్ సంస్థలు ఈ మార్గాలను తాత్కాలికంగా తప్పించుకుంటున్నాయి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, రెడ్ సీ పరిసరాల్లో భద్రతా పరిస్థితులు అస్థిరంగా ఉండటంతో.. సముద్ర ప్రయాణం సురక్షితం కాదన్న భావన బలపడింది.

Read Also: Taliban Attack: పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

Huge impact on Indian exports.. Damaging charges..
Huge impact on Indian exports.. Damaging charges..

సముద్ర రవాణా ఖర్చులు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి

ఈ పరిస్థితుల్లో.. చాలా షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు తమ నౌకలను ఆఫ్రికా ఖండం దక్షిణ అంచున ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిప్పుతున్నాయి. ఇది సంప్రదాయ మార్గంతో పోలిస్తే చాలా పొడవైన దారి. ఫలితంగా ప్రయాణ దూరం వేల నాటికల్ మైళ్ల వరకు పెరుగుతోంది. ఇది కేవలం దూరం పెరగడమే కాకుండా.. సమయం, ఖర్చు రెండింటినీ గణనీయంగా పెంచుతోంది. ఈ మార్గ మార్పు కారణంగా నౌకల ప్రయాణ సమయం సాధారణంగా 10 నుంచి 20 రోజుల వరకు పెరిగింది. అంటే సరుకులు యూరప్ చేరడానికి ముందుకంటే ఎక్కువ సమయం పడుతోంది. దీనితో పాటు, ఫ్రైట్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం సముద్ర రవాణా ఖర్చులు 40 నుంచి 50 శాతం వరకు పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.దీంతో పాటు ఇంధన వినియోగం పెరగడం, నౌక సిబ్బంది ఖర్చులు, ఆపరేటింగ్ వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ అదనపు భారాన్ని షిప్పింగ్ కంపెనీలు ఎగుమతిదారులపై మోపుతున్నాయి. చివరికి ఈ ఖర్చు వినియోగదారుల వరకు చేరే అవకాశం ఉంది. ఉదాహరణకు భారత్‌లోని నావా శెవా పోర్ట్ నుంచి ఉత్తర యూరప్‌కు ఒక 20 అడుగుల కంటెయినర్‌ను పంపేందుకు గతంలో 1,200 డాలర్ల నుంచి 1,800 డాలర్ల మధ్య ఖర్చయ్యేది.

ఎగుమతిదారులకు పెద్ద సవాల్‌

ప్రస్తుతం అదే కంటెయినర్‌కు 2,500 డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతోంది. ఇందులో బేస్ ఫ్రైట్‌తో పాటు ఇంధన సర్ప్లస్, వార్-రిస్క్ ఛార్జీలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి భారత ఎగుమతిదారులకు పెద్ద సవాల్‌గా మారింది. సరుకులు ఆలస్యంగా చేరడం వల్ల డెలివరీ గడువులు తప్పిపోతున్నాయి. ఫిక్స్‌డ్ ప్రైస్ ఒప్పందాలపై పనిచేసే ఎగుమతిదారులు పెరిగిన ఖర్చును భరించలేక నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బాస్మతి బియ్యం, వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ సరుకుల ఎగుమతుల్లో ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెడ్ సీ మార్గం ప్రపంచ కంటెయినర్ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు మూడో వంతు సరుకులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. ఈ మార్గం దెబ్బతినడంతో ప్రపంచవ్యాప్తంగా సరుకు కొరత, ధరల పెరుగుదల వంటి ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రవాణా ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. దీని వల్ల భారత ఎగుమతుల పోటీ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870