Telangana Budget : ఈరోజు తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు అంటే బుధవారం రెండోసారి శాసనసభసలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, సొంత పన్నుల రాబడులు, రుణ సేకరణకు గల అవకాశాలు, కేంద్రం నుంచి అందే సాయం ప్రాతిపదికన వాస్తవిక కోణంలో వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) గాను రూ.3.05 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.

రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిపాదనలు
బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2024–25లో ప్రతిపాదించిన రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌కు ఇది సుమారు 5 శాతం అదనం. బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో భేటీ కానున్న రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించనుంది. తాజా బడ్జెట్‌లో ఎప్పటిలాగే వ్యవసాయం, వైద్యం, సాగునీరు, విద్య, గ్రామీణాభివృద్ధి శాఖల పద్దులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆరు గ్యారంటీల అమలుతోపాటు అభివృద్ధి, సంక్షేమం సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయని పేర్కొంటున్నాయి.