19వ విడత డబ్బులను విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు ప్రతీ సంవత్సరం పెట్టుబడి సాయం కింద రూ.6,000 చొప్పున ఇస్తోంది. ఇలా 3 విడతల్లో ఈ డబ్బును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. తాజాగా 19వ విడత డబ్బును ఫిబ్రవరి 24న జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ ప్రధానమంత్రి మోడీ.. దాదాపు 9.7 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.22 వేల కోట్లను విడుదల చెయ్యబోతున్నారు.

మఖానా బోర్డు ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్
ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి బీహార్‌ని ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఈ సంవత్సరం చివర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల మోడీ.. భాగల్పూర్‌ని ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో రైతులు ఎక్కువ. పైగా.. కొన్నేళ్లుగా వారు రకరకాల పంటలు పండిస్తూ, ప్రయోగాలు చేస్తూ, విజయాలు సాధిస్తున్నారు. అదీకాక.. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం.. మఖానా బోర్డు ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీహార్‌లో మఖానా సాగు ఎక్కువగా ఉంది.
ఇప్పటివరకూ 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు
పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 24, ఫిబ్రవరి 2019లో ప్రారంభించింది. ఇప్పటివరకూ 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు ఇచ్చింది. ఐతే.. ఈ డబ్బును పొందాలంటే.. తప్పనిసరిగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్లలో ఈ-కేవైసీ పూర్తి చెయ్యాలి. దీన్నే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటారు. అంటే.. అకౌంట్ ఓపెన్ చేశాక.. బ్యాంక్ వారు అడిగే కొన్ని వివరాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్‌కి మొబైల్ నంబర్, ఆధార్ లింక్ చేసి ఉండాలి. అలాగే అడ్రెస్, గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ పూర్త చేసి ఉండాలి. ఈ-కేవైసీ సంపూర్ణంగా చేసిన వారికే మనీ జమ అవుతుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం: రైతులకు ఆర్థిక సహాయం
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతుల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం. ఈ పథకంతో రైతులు తమ రైతు పనుల కోసం ఆర్థిక సహాయాన్ని అందుకోవడంతో పాటు, వారి జీవితం ప్రమాణాలు కూడా మెరుగవుతాయి. దేశంలో చాలా మంది చిన్న రైతులు ఆర్థికంగా సంక్షోభంలో ఉండగా, ఈ పథకం వారి కోసం ఒక శక్తివంతమైన మద్దతుగా నిలుస్తోంది.