న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ అనూహ్యంగా ఎంపిక చేసింది. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం.26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ.. బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్ఠానం రేఖాగుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. శాలీమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు.తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం.

ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళ
ఇక, పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్‌ఖడ్‌ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. గురువారం సాయంత్రం ప్రధాని మోడీ, ఎన్డీయే నేతల సమక్షంలో ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. తొలి నుంచీ ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పర్వేష్ వర్మకు నిరాశే ఎదురైంది.
నేడే ప్రమాణ స్వీకారం
రామ్‌లీలా మైదానంలో గురువారం వేల మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు ఎన్డీయే నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతలు వెంట రాగా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం పలికారు.