నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా, ఆయన వారసత్వాన్ని గౌరవించేందుకు కటక్‌లోని నేతాజీ జన్మస్థలంలో మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమం జనవరి 23న ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధికారికంగా ప్రారంభించనున్నారు. పరాక్రమ దినోత్సవం 2025 సందర్భంగా, చారిత్రాత్మక నగరమైన కటక్‌లోని బారాబటి కోటలో జనవరి 23 నుండి 25 వరకు ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడతాయి. నేతాజీ 128వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం జరగడం గర్వకారణం.

ప్రభుత్వం నేతాజీ జయంతిని ‘పరాక్రమ దినోత్సవం‘ గా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి పరాక్రమ దినోత్సవం వేడుక 2021లో కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో జరిగింది. 2022లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2023లో అండమాన్ నికోబార్ ద్వీపాలకు 21 మంది పరమ వీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు. 2024లో ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలో ప్రధానమంత్రి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం, నేతాజీ జన్మస్థలమైన కటక్ నగరంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరాక్రమ దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. మూడు రోజుల ఈ వేడుకలు, నేతాజీ జన్మస్థలంలో జాతీయ జెండా ఎగురవేయడం ద్వారా ముఖ్యమంత్రి మరియు ఇతర ప్రముఖుల హాజరుతో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం, ఆ స్థలం నేతాజీకి అంకితం చేసిన మ్యూజియంగా మారింది.
బారాబటి కోటలో ప్రధాన మంత్రి వీడియో సందేశంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. నేతాజీ జీవిత చరిత్ర, విజయగాథలపై పుస్తకాలు, అరుదైన ఫోటోలు, డాక్యుమెంట్లతో ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. ఇంకా ఏఆర్/వీఆర్ ప్రదర్శనలు నేతాజీ ప్రయాణాన్ని పాఠకులు, సందర్శకులు ఆస్వాదించేలా చేస్తాయి. శిల్ప, పెయింటింగ్ పోటీలు, వర్క్షాప్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకల ప్రత్యేక ఆకర్షణలు. అలాగే, నేతాజీ జీవితంపై చిత్రాలు కూడా ప్రదర్శించబడతాయి. ఈ కార్యక్రమం ఒడిశా సాంస్కృతిక సంపదను ప్రపంచానికి తెలియజేయడంలో తోడ్పడడమే కాకుండా, నేతాజీ ఆశయాలను గౌరవించడం ప్రధాన లక్ష్యం.