ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) బుధవారం మంగళగిరి (Mangalagiri) నియోజకవర్గంలో పర్యటించారు. తాడేపల్లి పట్టణంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలతో ముఖాముఖి భేటీ అయ్యారు. తన స్వంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ తిరిగారు.తాడేపల్లిలోని పలు కాలనీల్లో గడిపిన లోకేశ్, ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి చర్యలు వివరించారు. ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. స్థానికుల ఆవేదనల్ని వినే క్రమంలో పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

కృష్ణా నదిపై రిటైనింగ్ వాల్ పనులు పరిశీలన
తాడేపల్లి మండలం సీతానగరంలో రూ.295 కోట్ల వ్యయంతో నిర్మించబడుతున్న రిటైనింగ్ వాల్ పనులను మంత్రి నేరుగా పరిశీలించారు. వరదల సమయంలో ముంపునకు గురయ్యే ప్రజల సమస్యలను ఎత్తిచూపుతూ, ఈ నిర్మాణం వారికి శాశ్వత భద్రత కలిగించనుందని అన్నారు.లోతట్టు ప్రాంతాల్లో ప్రతి ఏడాది వచ్చే వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని లోకేశ్ గుర్తు చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపడానికే రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణం పూర్తయితే మహానాడు కాలనీతోపాటు సీతానగరంలాంటి ప్రాంతాలకు రక్షణ లభిస్తుందని భరోసా ఇచ్చారు.

సోషల్ మీడియా ద్వారా స్పందన
తన పర్యటన అనంతరం లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “ఇంటింటికి వెళ్లి అభివృద్ధి వివరించాను. సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా” అని చెప్పారు. ప్రజలతో నేరుగా మమేకం కావాలన్న ఆలోచనతో ఈ పర్యటనలు కొనసాగుతాయని తెలిపారు.
Read Also : Telugu movies piracy : 65 సినిమాలు పైరసీ చేసిన కీలక వ్యక్తి అరెస్ట్!