ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త జైలు నిర్మాణానికి అవకాశం ఉండడంతో, ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ, సర్వే మరియు కన్సల్టెన్సీ సేవల కోసం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

తిహార్ జైలును కొత్త ప్రాంగణానికి తరలింపు
1958లో 400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ జైలు ప్రస్తుతం 13,000 మంది ఖైదీలకు నిలయంగా ఉంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా పరమైన సమస్యలు, అధిక ఖైదీల సంఖ్య, స్థానాభావం వంటి సమస్యలు పెరుగుతుండటంతో, దీనిని కొత్త ప్రదేశానికి తరలించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త జైలు సౌకర్యాలు మెరుగుపరిచేలా రూపొందించనున్నారు.
తిహార్ జైలు చరిత్ర
తొలుత పంజాబ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ జైలు, 1966లో ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోకి మారింది. అప్పటి నుంచి దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన జైళ్లలో తిహార్ ఒకటి. దీనిలో అనేక రాజకీయ ఖైదీలు, హై-ప్రొఫైల్ నేరస్తులు ఉన్నారు. తాజా నిర్ణయం ద్వారా భద్రత మెరుగుపడటంతో పాటు, ఖైదీలకు కూడా మెరుగైన వసతులు లభించనున్నాయి.