గుజరాత్‌లోని ద్వారక జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన దొంగలు శివలింగాన్ని అపహరించిన ఘటన భక్తుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అరేబియా సముద్ర తీరాన వెలసిన శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా అలంకరించబడింది. అయితే, వేడుకలకు ఒక రోజు ముందు ఆలయంలోని పురాతన శివలింగం అదృశ్యమవడంతో భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ ఘటన ఆలయ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది.

దొంగలు శివలింగాన్ని సముద్రంలో పడేశారా..?
శివలింగం కనిపించకపోవడంతో ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దొంగలు శివలింగాన్ని సముద్రంలో పడేశారా? అనే అనుమానంతో స్కూబా డైవర్లను రంగంలోకి దింపారు. ప్రస్తుతం సముద్రంలో గాలింపు కొనసాగుతోంది. ఈ విగ్రహం ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండటంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ పవిత్రతకు భంగం
శివరాత్రి రోజున ఇలా జరగడం పట్ల భక్తుల్లో ఆగ్రహం నెలకొంది. ఆలయ పవిత్రతను భంగం కలిగించే ఈ సంఘటనపై పోలీసుల దృష్టి వెళ్లింది. దొంగిలించిన వారు ఎవరు? వారి ఉద్దేశ్యం ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. భక్తులు శివలింగాన్ని తిరిగి ఆలయంలో ప్రతిష్టించేందుకు అధికారులను కోరుతున్నారు. శివరాత్రి రోజున ఆలయంలో శివలింగం లేకపోవడం భక్తులకు తీరని లోటుగా మారింది.