ముంబై 26/11 ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కార్యాలయంలో విచారిస్తున్నారు. శుక్రవారం భారత్‌కు చేరుకున్న రాణాను కోర్టు 18 రోజుల NIA కస్టడీకి పంపింది.
పెన్ను, పేపర్లు, అలాగే ఖురాన్
విచారణ సందర్భంగా తహవూర్ రాణా కొన్ని వస్తువులు కోరాడు. అతను అధికారులను అడిగిన వస్తువుల్లో పెన్ను, పేపర్లు, అలాగే ఖురాన్ ఉన్నాయి. అధికారుల అనుమతితో వీటిని అతనికి అందజేశారు. ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా, ఇతర ఖైదీల మాదిరిగానే నిబంధనల ప్రకారం రాణాను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై ఆరా
తహవూర్ రాణా ఉగ్రవాద ఘటనలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అతని పాత లింకులు, సహచరులు, ఉగ్ర సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనగా, రానా నుంచి ఏమి బయటపడుతుందన్న దానిపై ప్రజలు, భద్రతా సంస్థలు గమనిస్తూనే ఉన్నాయి.