ఇటీవలి రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఒక వదంతి హల్‌చల్ చేస్తోంది. రూ.500 నోట్ల (Rs.500 notes) సరఫరా ఆపేస్తున్నారు అంటూ మేసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. ఈ నోట్లను మార్చుకోవాలని సూచిస్తూ వాట్సాప్ ఫార్వార్డులు తిరుగుతున్నాయి. కానీ అసలు సంగతి ఏంటంటే… ఇవన్నీ అవాస్తవాలు!ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) వెంటనే స్పందించింది. “రూ.500 నోట్లను నిలిపివేస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం లేదు” అని తేల్చిచెప్పింది. ఏటీఎంలలో ఈ నోట్ల జారీ యథాతథంగా కొనసాగుతుందని, పౌరులు ఆందోళన చెందాల్సిన పని లేదని వెల్లడించింది.ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో స్పష్టత ఇచ్చారు. ప్రజల అవసరాల ఆధారంగా మాత్రమే నోట్లు ముద్రించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిపై ఆర్బీఐతో సంప్రదింపులు జరుగుతాయని పేర్కొన్నారు.

వాట్సాప్ మెసేజ్‌లకు చుక్కెదురుగా కేంద్రం స్పందన
వాస్తవానికి, సెప్టెంబర్ 30 తర్వాత రూ.500 నోట్ల వినియోగం ఆగిపోతుందని ఒక సందేశం వైరల్ అయ్యింది. అందులో ప్రజలు తాము కలిగి ఉన్న నోట్లు మార్చుకోవాలని కూడా సూచించారు. కానీ ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని కేంద్రం తేల్చి చెప్పింది.ఈ విషయంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా స్పందించింది. ఆ సందేశంలో పేర్కొన్న వివరాల్లో నిజం లేదు. ఆర్బీఐ నుంచి అలాంటి ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది.
చిన్న నోట్లు అందుబాటులో ఉండేలా RBI చర్యలు
రూ.500 నోట్లు ఆపడం వాస్తవం కాదని చెప్పినప్పటికీ, రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు ఎప్పటికప్పుడు చిన్న డినామినేషన్ నోట్ల అవసరం ఉంటుందని, బ్యాంకులు దీనిపై దృష్టి పెట్టాలని ఆర్బీఐ ఇప్పటికే సూచించింది.ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆర్బీఐ ఒక సర్క్యులర్ జారీ చేసింది. అందులో అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించిందని మంత్రి గుర్తుచేశారు.
ఏటీఎంలలో చిన్న నోట్ల లభ్యత పెంపు లక్ష్యం
ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75 శాతం ఏటీఎంలలో, కనీసం ఒక క్యాసెట్ నుండి రూ.100 లేదా రూ.200 నోట్లు రావాలి.ఇది మొదటి దశ. రెండో దశగా, మార్చి 31, 2026 నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ సౌకర్యం ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల ప్రజలకు చిన్న నోట్ల లభ్యత మరింత మెరుగవుతుంది.
తప్పుడు ప్రచారాలపై అప్రమత్తంగా ఉండండి
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్‌ను నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో అధికారిక సమాచారం కోసం మాత్రమే వెతకాలి. PIB ఫ్యాక్ట్ చెక్ వంటి ప్రభుత్వ వేదికలు ఈ విషయంలో నమ్మదగిన రిఫరెన్స్.కాబట్టి, రూ.500 నోట్లు ఆపేస్తున్నారన్న వదంతులు అసత్యం. ప్రజలు శాంతిగా వ్యవహరించాలి. చిన్న నోట్ల లభ్యత పెరుగుతున్నా, పెద్ద నోట్లపై ఎలాంటి మార్పులు లేవు.
Read Also : Satya Nadella: టీమ్ ఇండియా విజయంపై స్పందించిన సత్య నాదెళ్ల