‘యమునా జలాల యుద్ధం’ ముదురుతోంది. ఢిల్లీకి సరఫరా చేసే నీటిలో బీజేపీ “విషం” కలపడం ద్వారా ప్రజలను హతమార్చాలని చూస్తోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి తాగే నీటిలో విషం కలపగలదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘోండా శాసనసభ నియోజకవర్గంలో జరిగిన సభలో ప్రధాని బుధవారంనాడు మాట్లాడుతూ, యుమునా జలాల ప్రక్షాళనలో ఆప్ విఫలమైనందునే హేయమైన ఆరోపణలు చేస్తోందన్నారు. హర్యానా ప్రజలు ఢిల్లీలో నివసించడం లేదా? అప్పుడు ఢిల్లీ జలాలను ఎలా విషమయం చేస్తుంది? ప్రధాని కూడా ఈ జలాలే తాగుతున్నారు.. అని మోదీ పేర్కొన్నారు. ”యమున పేరుతో ఓట్లడిగారు. ఇప్పుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీని నీళ్లు అడుక్కునేలా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాపాలకు పాల్పడుతున్నారు. చరిత్ర ఎన్నటికీ వాళ్లను క్షమించదు. ఢిల్లీ ఎప్పటికీ క్షమించదు. బీజేపీ మాత్రం ప్రజలకు స్వచ్ఛమైన జలాలను అందిస్తుంది” అని మోదీ అన్నారు.
![](https://vaartha.com/wp-content/uploads/2025/01/modi-and-kejriwal-1-1024x683.jpg.webp)
ఆప్ ప్రభుత్వం చేసిన నిందారోపణలను హర్యానా ప్రభుత్వం మరిచిపోదని ప్రధాని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఆప్ నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతోందని ఆక్షేపించారు.