తమిళ నటుడు శరత్ కుమార్ కథానాయకుడిగా నటించిన 150వ చిత్రం ది స్మైల్ మేన్ డిసెంబర్ 27, 2023న థియేటర్లలో విడుదలై, తాజాగా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శ్యామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సైకో థ్రిల్లర్ కేటగిరీలోకి వస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా శరత్ కుమార్ ఇప్పటికే పలువురు అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు సైకో కిల్లర్ కథలో ప్రధాన పాత్రలో కనిపించారు.
కథ
సీనియర్ సీఐడీ ఆఫీసర్ చిదంబరం (శరత్ కుమార్) ఒంటరిగా జీవితం గడుపుతున్నాడు. ఐదేళ్ల క్రితం ‘స్మైల్ మేన్’ అనే కిల్లర్‌ను పట్టుకునే ప్రయత్నంలో అతను తీవ్రంగా గాయపడతాడు. అదే సమయంలో, ఆఫీసర్ వెంకటేశ్ (సురేశ్ మీనన్) చేతిలో స్మైల్ మేన్ చనిపోయాడనే వార్తలు వస్తాయి. ఈ ఘటన తర్వాత వెంకటేశ్ జాడ తెలియకపోవడంతో, కేసు ముగిసినట్టే అనుకుంటారు.అయితే, చిదంబరం గాయాల నుండి కోలుకున్నా, అతనికి అల్జీమర్స్ వచ్చే అవకాశముందని డాక్టర్లు చెబుతారు. ఒక సంవత్సరంలో పూర్తిగా తన గతాన్ని మరిచిపోతాడని హెచ్చరిస్తారు. అనుకోని విధంగా, అతను స్మైల్ మేన్ చనిపోలేదని చెప్పడం పోలీస్ అధికారులను షాక్‌కు గురి చేస్తుంది. ఈ వార్త వెలువడిన మరుసటి రోజు నుంచి మళ్లీ వరుస హత్యలు ప్రారంభమవుతాయి. స్మైల్ మేన్ నిజంగా ఎవరు? అతని హత్యలకు కారణం ఏమిటి? చిదంబరం అతన్ని ఎలా పట్టుకుంటాడు? అనేదే కథా సరాంశం.

సినిమా విశ్లేషణ
సైకో కిల్లర్ కథల ప్రత్యేకత రెండు ప్రధాన అంశాలలో ఉంటుంది – హంతకుడు ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు? మరియు అతనిని కథానాయకుడు ఎలా పట్టుకుంటాడు? ఈ రెండు ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి.సినిమాలో హంతకుడు తన హత్యలకు ప్రత్యేక ముద్ర వేయడానికి, చంపిన వ్యక్తుల దంతాలను పూర్తిగా బయటకు కనిపించేలా పెదవుల చుట్టూ భాగాన్ని కోసేస్తాడు. ఇది హింసాత్మకమైన విజువల్స్‌ను తెరపై తీసుకురావటంతో ప్రేక్షకులకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది.ఫస్ట్ హాఫ్ పూర్తిగా కథను నడిపిస్తూ, సైకో కిల్లర్‌ను రివీల్ చేసే వరకూ సాగుతుంది. అయితే, సెకండ్ హాఫ్‌లో కథ నెమ్మదించిపోతుంది. చిదంబరం అల్జీమర్స్ బారిన పడటంతో, అతను స్మైల్ మేన్‌ను పట్టుకోవడానికి పడే కష్టం కథలో టెన్షన్‌ను పెంచేలా కనిపించినా, దీనిని మరింత ఆసక్తికరంగా పొడిగించాల్సిన అవసరం ఉంది.
సాంకేతిక విషయాలు నటీనటులు
శరత్ కుమార్ పోలీస్ పాత్రల్లో అనుభవం కలిగిన నటుడు. ఈ పాత్రలోనూ అతని పెర్ఫార్మెన్స్ బాగా పనిచేసింది. విలన్ పాత్రలో కలైయరసన్ కూడా తన స్థాయికి తగ్గ నటన అందించారు. కానీ కథ అందించే థ్రిల్, టెన్షన్ పూర్తిగా మెప్పించలేకపోయింది.విక్రమ్ మోహన్ సినిమాటోగ్రఫీ మంచి విజువల్ టోన్ కలిగించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా గవాస్కర్ అవినాష్ సాధారణంగా ఉన్నా, కథలో అత్యవసరమైన సన్నివేశాల్లో సంగీతం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఎడిటింగ్ పరంగా మరింత క్రిస్ప్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.