జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్‌గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు ‘జయకేతనం’ అనే పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పెట్టారు. ఈ విషయాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జరగనున్న ఈ సభ, రాష్ట్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ప్రకటించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికుల సమాగమం
ఈ భారీ సభకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన అభిమానులు, వీర మహిళలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా జనసేన అనుచరులు తరలిరానున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఈ సభ రాష్ట్ర సంస్కృతి, స్థానిక చరిత్రకు అద్దం పట్టేలా ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మహానుభావుల సేవలను స్మరించుకునే ప్రవేశ ద్వారాలు
సభ ప్రాంగణానికి చారిత్రక ప్రాముఖ్యతను చాటేలా, మహానుభావుల పేర్లు ఇచ్చిన మూడు ముఖద్వారాలను ఏర్పాటు చేశారు. మొదటి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టారు. రెండవ ద్వారానికి భవన నిర్మాణ కార్మికులకు సేవలందించిన దొక్కా సీతమ్మ పేరు, మూడవ ద్వారానికి విద్యా విస్తరణలో విశేష కృషి చేసిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టారు. వారి సేవలను భావితరాలకు తెలియజేసే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జనసేన విజయానికి గుర్తుగా జయకేతనం
జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన విజయాన్ని సాధించిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులు విజయం సాధించారని, ఇది నాయకత్వ నైపుణ్యం, కార్యకర్తల త్యాగఫలం అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేయడానికి, జనసైనికులకు ఉత్సాహం నింపడానికి ‘జయకేతనం’ సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 14న జరిగే ఈ సభలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు.