పంజాబ్‌లోని బతిండా జిల్లాలో సంచలన సంఘటన వెలుగుచూసింది. ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ విద్యార్థి (Student) ప్రయత్నం చేశాడు. ఆన్‌లైన్‌లో రసాయనాలు కొనుగోలు చేసి బాంబు తయారీ (Bomb making)కి యత్నించాడు. కానీ పేలుడు సంభవించడంతో అతడే తీవ్రంగా గాయపడి చేతిని కోల్పోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఈ కుట్ర బహిర్గతమైంది.జీడా గ్రామానికి చెందిన గురుప్రీత్ (19) లా విద్యార్థి. 12వ తరగతిలో 75 శాతం మార్కులు సాధించాడు. స్కూల్‌లో 90 శాతం హాజరుతో నిశ్శబ్ద స్వభావం కలిగినవాడిగా గుర్తింపు పొందాడు. సాధారణ కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి పాకిస్థాన్ ప్రచార వీడియోల ప్రభావానికి లోనయ్యాడు. జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వీడియోలు చూసి తీవ్రవాద భావజాలం వైపు మళ్లాడు.
కశ్మీర్‌పై దాడి యత్నం
గురుప్రీత్ జమ్ముకశ్మీర్‌లోని కథువా ఆర్మీ బేస్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆత్మాహుతి దాడి కోసం ప్లాన్ సిద్ధం చేశాడు. రసాయనాలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి బాంబు తయారీకి ప్రయత్నించాడు. సెప్టెంబర్ 11న కథువాకు వెళ్లేందుకు బస్సు టికెట్ కూడా బుక్ చేశాడు.కానీ సెప్టెంబర్ 10న ఉదయం బాంబు తయారు చేసే సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. రసాయనాల కలపడం సమయంలో బాంబు పేలిపోయింది. దీంతో గురుప్రీత్ కుడి చేయి తెగిపోవడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సాయంత్రం మిగిలిన రసాయనాలను తొలగించేందుకు అతడి తండ్రి జగ్తార్ సింగ్ ప్రయత్నించగా మరోసారి శక్తివంతమైన పేలుడు సంభవించింది. తండ్రి కూడా గాయపడి ముఖానికి, కళ్లకు దెబ్బలు తగిలాయి. తండ్రీకొడుకులు ఎయిమ్స్ బతిండాలో చికిత్స పొందుతున్నారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు
ఎయిమ్స్ నుంచి పోలీసులకు సమాచారం అందడంతో ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మొదట భద్రతా కారణాలతో ఒక రోజు పాటు ఇంట్లోకి ప్రవేశించలేదు. తర్వాత రసాయన నమూనాలు సేకరించి, కొరియర్ ప్యాకేజీలు, సూసైడ్ జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
నకిలీ గుర్తింపుతో కొనుగోళ్లు
పోలీసుల దర్యాప్తులో గురుప్రీత్ నకిలీ గుర్తింపు ఉపయోగించినట్లు తెలిసింది. ‘ఇక్బాల్’ పేరుతో కెమికల్స్ ఆర్డర్ చేశాడు. తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితుడై సొంతంగా కుట్ర పన్నినట్లు స్పష్టమైంది. అతను కోలుకున్న తర్వాత మరింత ప్రశ్నించనున్నారు.ఈ ఘటన పంజాబ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్‌ఐఏ దృష్టిని ఆకర్షించింది. కథువా పోలీసులు కూడా ఈ కేసు దర్యాప్తులో భాగమయ్యారు. ఒక సాధారణ విద్యార్థి తీవ్రవాదం వైపు మళ్లడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చాటిచెప్పింది. సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా పడుతోందో మరోసారి స్పష్టమైంది.
Read Also :