ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు పెట్టుబడి కూడా రాని ధరలకు తమ పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, క్వింటాకు రూ.15,000 నష్టంతో రైతన్నలు విలవిల్లాడిపోతున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని గమనించి, రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం మరింత బాధ పెడుతోందని ఆమె ఆరోపించారు.

కౌలు రైతులకు మరింత నష్టం
ప్రభుత్వం మిర్చి రైతులకు రూ.11,000 మద్దతు ధర ఇచ్చినట్లు ప్రకటించడం గప్పాలని, నిజానికి రైతులు ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి పెట్టి కూడా నష్టపోతున్నారని షర్మిల వివరించారు. కౌలు రైతులకు మరింత నష్టం ఏర్పడుతోందని, కేంద్ర ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధరను రూ.26,000గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదనంగా, రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని వెంటనే అమలు చేయాలని, మిర్చి రైతులకు బోనస్ ప్రకటించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మిర్చి రైతులకే కాదు, టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు
ఇక, మిర్చి రైతులకే కాదు, టమాటా రైతులకు కూడా తీరని కష్టాలు వచ్చిపడ్డాయని షర్మిల అన్నారు. మార్కెట్లో టమాటా ధర తగ్గిపోవడంతో రైతులు కనీస పెట్టుబడిని కూడా రాబట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. టమాటా కిలోకు రూ.15 ధర ఉన్నా, రైతుకు మూడ్నాలుగు రూపాయలు కూడా రావడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే టమాటా రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ధరల నియంత్రణ కోసం తగిన చర్యలు అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.