తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, వాటిని మూడు ఉప వర్గాలుగా విభజించాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్ సిఫార్సు చేసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికను సమర్పించారు. 59 ఎస్సీ వర్గాలను మూడు గ్రూపులుగా విభజించారు:
- గ్రూప్ I: అత్యంత వెనుకబడిన 15 ఎస్సీ కులాలు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288%. వీరికి 1% రిజర్వేషన్ సిఫారసు.
- గ్రూప్ II: మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఎస్సీ కులాలు. వీరి జనాభా 62.74%. వీరికి 9% రిజర్వేషన్ సిఫారసు.
- గ్రూప్ III: రిజర్వేషన్ల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందిన 26 ఎస్సీ కులాలు. వీరి జనాభా 33.963%. వీరికి 5% రిజర్వేషన్ సిఫారసు.
మాదిగ సామాజిక వర్గం నేత మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీల ఉప వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమం కొనసాగుతోంది. మాదిగలు గ్రూప్ IIలో ఉండగా, మాలలు గ్రూప్ IIIలో చేర్చబడ్డారు. మాదిగల జనాభా 61.967%, మాలల జనాభా 29.265% గా ఉంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఎస్సీ సబ్ కేటగిరీపై వాయిదా తీర్మానం ఇచ్చినందుకు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు దీనిని అమలు చేయడం సంతృప్తికరంగా ఉందన్నారు.
2024 సెప్టెంబర్ 12న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం, 2024 అక్టోబర్‌లో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చివరగా, 2025 ఫిబ్రవరిలో ఈ కమిషన్ తన నివేదికను అసెంబ్లీలో సమర్పించగా, కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ, దాన్ని అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం ప్రకటించారు.