అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు 2వ సారి పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి మీకు తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య మార్కెట్‌లో పెను మార్పు తీసుకురావాలనే భారీ లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య రిలయన్స్ ట్రస్ట్ చైర్మన్ నీతా అంబానీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్‌ను వాషింగ్టన్‌లో నిన్న ఓ పార్టీలో కలిశారు.
వీరి భేటీకి సంబంధించిన వీడియో, ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కాగా, జనవరి 20న జరగనున్న ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖేష్ అంబానీ, నీతా అంబానీ హాజరుకానున్నారు. డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఈ ప్రత్యేక విందులో ముఖేష్ అంబానీతో పాటు, ఎం౩ఎం డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ బన్సాల్ అండ్ ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా కూడా పాల్గొన్నారు.
ఎవరు ఈ 3 భారతీయ రియల్ ఎస్టేట్ కంపెనీల అధినేతలు..? డోనాల్డ్ ట్రంప్‌తో వారికి సంబంధం ఏమిటి? కల్పేష్ మెహతా ట్రంప్ టవర్స్ లైసెన్స్ పొందిన ఇండియన్ హెడ్ అలాగే ట్రంప్ బ్రాండ్‌ను భారతదేశానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పంకజ్ బన్సల్ ఎం౩ఎం డెవలపర్స్ భారతదేశంలోని ట్రంప్ టవర్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్రెంచ్ బిలియనీర్ అండ్ టెక్ వ్యవస్థాపకుడు జేవియర్ నీల్ తన భార్యతో హాజరుకానున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో, డోనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతను గతంలో 2017 నుండి 2021 మధ్య 45వ అధ్యక్షుడిగా కొనసాగారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రభుత్వం తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు.