అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే జన్మతః పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దుచేసేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దాన్ని సమర్ధించుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు ట్రంప్ సర్కార్ తీసుకున్న జన్మతః పౌరసత్వం రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు డెమోక్రాట్లు కోర్టును ఆశ్రయించడంతో దాని అమలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న ట్రంప్.. అసలు జన్మతః పౌరసత్వం ఎందుకు తన దేశం తీసుకొచ్చిందో వెల్లడించారు. అమెరికాలో బానిసల పిల్లలకు వర్తించేలా గతంలో జన్మతః పౌరసత్వ నిబంధన తీసుకొచ్చినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వారి పిల్లలకు హక్కులు కల్పించాలనే దీన్ని అమల్లోకి తెచ్చారన్నారు. అంతే కానీ ఇతర దేశాల జనం అంతా వచ్చి అమెరికాలో పోగు పడేందుకు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అందుకే తాను జన్మతః పౌరసత్వ నిబంధనను రద్దు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎంతవరకైనా వెళ్లేందుకు తాను సిద్దమని తేల్చిచెప్పేశారు.

మరోవైపు జన్మతః పౌరసత్వం దుర్వినియోగం అవుతోందని, దీని వల్ల ఇతర దేశాల వారు, అర్హత లేని పిల్లలు పౌరసత్వం పొందుతున్నారని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ చట్టం గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చిందని ట్రంప్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని తేల్చిచెప్పేశారు. కాబట్టి తన ప్రభుత్వం జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని, అక్కడ వంద శాతం తనకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుటికే ట్రంప్ సర్కార్ పలు దేశాలకు చెందిన వలసవాదుల్ని విమానాల్లో వారి స్వదేశాలకు పంపేస్తోంది. అలాగే స్థానికంగా వీసాల జారీ విషయంలో పలు మార్పులు చేస్తున్నారు. దీని ప్రభావం భారత్ తో పాటు పలు దేశాలపై కనిపిస్తోంది. ఇప్పటికే భారతీయులు అమెరికా నుంచి తిరుగుముఖం పడుతున్నారు. ఇక వీసాల కోసం ఎదురుచూస్తున్న వారి కష్టాలు అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు జన్మతః పౌరసత్వంపై ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారాయి.