తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఎలక్ట్రిక్ బస్సుల పేరిట డిపోల ప్రైవేటీకరణ జరుగుతోందన్న ప్రచారాన్ని ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఛార్జింగ్ మినహా ఇతర కార్యకలాపాలు మొత్తం ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలుపుతూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టింది.
కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారం ఎలక్ట్రిక్ బస్సుల అనుసరణ జరుగుతోందని TGSRTC తెలిపింది. ఈవీ పాలసీ కింద పరిసరాలను కాలుష్యరహితంగా ఉంచడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది. ఈ చర్యలు ప్రైవేటీకరణకు సంబంధం లేకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్నట్టు పేర్కొంది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్టెనెన్స్, ఛార్జింగ్ కార్యకలాపాలు మాత్రమే కన్సల్టెంట్ కంపెనీలకు అప్పగిస్తామని, ఆపరేషనల్ నియంత్రణ మాత్రం పూర్తిగా ఆర్టీసీ చేతుల్లోనే ఉంటుందని వెల్లడించింది. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
ఈ ఏడాది మేలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు ప్రజల సేవలోకి ప్రవేశిస్తాయని TGSRTC ప్రకటించింది. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ప్రజా రవాణా వ్యవస్థ మరింత సమర్థవంతం అవుతుందని, ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపింది. ప్రచారం చేస్తున్నవారు అసత్య వార్తల ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని TGSRTC విమర్శించింది.