హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ మేరకు పలు జిల్లాల్లో కొత్త గ్రామ (TG New villages) పంచాయతీల ఏర్పాటుకు అభ్యర్థునలు వస్తున్నాయి. వాటిని పరిశీలించడానికి పంచాయతీరాజ్ శాఖ సమాయత్తం అవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపుగా గ్రామ పంచాయతీల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో గత పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ కంటే ఇప్పుడు గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామాల విలీనమైన నేపథ్యంలో గతంలో కంటే ప్రస్తుతం గ్రామాల సంఖ్య తగ్గింది.

రాష్ట్ర అత్యన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో స్థానిక ఎన్నికల (Local elections in Telangana) నిర్వహణకు సన్నాహాలు ఊపందుకున్నాయి. తాజాగా ప్రభుత్వం లోకల్ ఎలక్షన్లను సెప్టెంబర్ 30, 2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్లు(జెడ్పిలు), 566 జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలు ఉన్నాయని.. వాటితోపాటు 5,773 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 1,12,694 వార్డులు ఉన్నట్లుగా లెక్క తేల్చారు. ఆ లెక్కల ప్రకారమే స్థానిక ఎన్నికలను నిర్వహిస్తామని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన కూడా స్పష్టం చేశారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే, జెడ్పీటీసీ సీట్లు 539 నుంచి 566కి పెరిగాయి. జిల్లా పరిషత్ల సంఖ్య 32 నుంచి 31కి తగ్గింది. ఎంపీటీసీ సీట్లు 5,817 నుంచి 5,773కు తగ్గాయి. ఇందుకు కారణం 71 గ్రామ పంచాయతీలు (TG New villages) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తోపాటు ఇతర మున్సిపాలిటీలు, నూతనంగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం అవ్వడమే.
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికలపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు కొన్ని గ్రామాలు, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్త గ్రామాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తుండటంతో వాటిని పరిశీలించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే పంచాయతీ ఎన్నికల నోటిపికేషన్ వచ్చే లోపు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రకటించిన గ్రామాల సంఖ్య కంటే అదనంగా పెరిగే అవకాశం ఉన్నటు తెలుస్తోంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Bhatti Vikramarka: మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యం – ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క