భారతదేశంలో టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటవడం ఇక కేవలం సమయమేనని ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎరాల్ మస్క్ (Errol Musk) విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో (In Delhi) మీడియాతో మాట్లాడిన ఆయన, టెస్లా భారత్‌లో అడుగుపెడుతుందని తనకు ఎలాంటి సందేహం లేదని స్పష్టంగా చెప్పారు.79 ఏళ్ల ఎరాల్ మస్క్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన పేర్కొన్నట్లుగా, భారత ప్రయోజనాలను ప్రధాని మోదీ కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు, టెస్లా కంపెనీ ప్రయోజనాలను ఎలాన్ మస్క్ కాపాడతారని ధీమాగా చెప్పారు. ఈ ఇద్దరూ కలిసే ఒక సరైన నిర్ణయానికి వస్తారని తెలిపారు.
టెస్లా ప్లాంట్‌పై ఎరాల్ మస్క్ గట్టి విశ్వాసం
“భారతదేశంలో టెస్లా ప్లాంట్ రావడంలో సందేహమే లేదు, అని ఆయన వ్యాఖ్యానించారు. టెస్లా ఒక పబ్లిక్ కంపెనీ కావడంతో, తాను ఎటువంటి అధికారిక వ్యక్తి కాకపోయినా తన అభిప్రాయం వ్యక్తీకరించానని తెలిపారు.ఎరాల్ మస్క్ భారత పర్యటన అనేక విషయాలను సూచిస్తోంది. దేశం హరిత సాంకేతికత, రిన్యూబుల్ ఎనర్జీ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆయన గ్లోబల్ అడ్వైజర్‌గా ఉన్న సర్వోటెక్ రిన్యూవబుల్ పవర్ సంస్థ కూడా ఈ దిశగా ముందుకెళ్తోంది.
2030 లక్ష్యాలు – ఈవీ విభాగంలో భారత్ దూసుకెళ్తోంది
భారత ప్రభుత్వం 2030 నాటికి ఈవీ వినియోగంలో భారీ లక్ష్యాలు పెట్టుకుంది. ప్యాసింజర్ కార్లు 30 శాతం, ద్విచక్ర వాహనాలు 80 శాతం, వాణిజ్య వాహనాలు 70 శాతం ఈవీలా ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. దీనికి అనుగుణంగా టెస్లా ఎంట్రీ ఎంతో కీలకమవుతుంది.
ఇతర బ్రాండ్లు కూడా ఈవీ రంగంలో ఆసక్తిగా ఉన్నాయ్
కేంద్ర మంత్రి హెచ్.డి కుమారస్వామి కూడా సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మెర్సిడెస్ బెంజ్, హ్యుందాయ్, కియా వంటి కంపెనీలు భారతదేశంలో ఈవీ తయారీపై ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పారు. వాటితో పోలిస్తే టెస్లా ఇప్పటికీ షోరూమ్‌ల స్థాయిలోనే ఉందని, తయారీపై స్పష్టత లేదని తెలిపారు.టెస్లా భారత్‌లో ప్లాంట్ పెడుతుందా లేదా అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. కానీ ఎలాన్ మస్క్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త ఉత్సాహాన్ని జోడించాయి. టెస్లా ఎంట్రీతో భారతీయ ఈవీ రంగం మరింత వేగం తీసుకుంటుందన్నది ఖాయం.
Read Also : Jharkhand : ఇండిగో విమానానికి రాబందు ఢీ – రాంచీలో అత్యవసర ల్యాండింగ్ …