ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు
తిరుపతి : తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరగనున్నాయి.

వర్క్‌షాపులు, మాస్టర్‌క్లాసులు- టెంపుల్ టాక్స్
ఈ కన్వెన్షన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను నిర్వాహకులు చదివి వినిపించారు. దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, వర్క్‌షాపులు, మాస్టర్‌క్లాసులు- టెంపుల్ టాక్స్ జరుగనున్నాయి. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతిలోని ఆశ కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశ ఎక్స్‌పో కొనసాగనుంది. మూడు రాష్ట్రాల సీఎంలు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, తిరుపతి జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన
58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు పాల్గొంటారు. ITCX ద్వారా 58 దేశాల్లో 1,581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం ఈ కార్యక్రమం ద్వారా చేపట్టనున్నారు. ఈ కన్వెన్షన్‌లో పునరుత్పాదక ఇంధనం, దేవాలయ పాలన, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహిస్తారు.