తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు జారీ చేయకపోవటంతో, రాష్ట్రంలోని అనేక కుటుంబాలు ఈ అనుమతుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. కొత్తగా పెళ్లయిన వారు, కుటుంబ విభజన కారణంగా ప్రత్యేక రేషన్ కార్డులు అవసరమైన వారు, ఇంకా పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్న వారు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 26, 2024న రేషన్ కార్డుల జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని సంకల్పించుకుంది. ప్రజాపాలన, ప్రజావాణి, మీ సేవ కేంద్రాల ద్వారా అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా కార్డులను మంజూరు చేశారు. తాజాగా, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త రేషన్ కార్డులపై ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ త్వరలోనే కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ప్రతి కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిందని చెప్పారు.
ఉగాది నుండి రేషన్ కార్డుల పంపిణీ
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన ప్రకారం, రేషన్ కార్డులు మంజూరైన కుటుంబాలకు వచ్చే ఉగాది పండుగ నుంచి రేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఉగాది నాటికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే అఫ్లికేషన్లు స్వీకరించిన ప్రజలకు తక్కువ సమయంలోనే కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు. పారదర్శక విధానం, అనర్హులెవరూ కార్డులు పొందకుండా చర్యలు తీసుకుంటారు. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ మాధ్యమాల ద్వారా నిర్వహించనున్నారు. అర్హులందరికీ కార్డులు అందేలా లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. కొత్త రేషన్ కార్డులు పొందిన వారు పదేళ్లపాటు వాటిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రేషన్ కార్డుదారులకు అదనంగా సన్నబియ్యం పథకం ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. ప్రతి కుటుంబ సభ్యుడికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం అందజేయనున్నారు. మొదటిగా ఈ పథకాన్ని నల్గొండ జిల్లాలో అమలు చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ పథకం ద్వారా పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పోషకాహారాన్ని అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. రేషన్ కార్డుల ప్రక్రియతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో కూడా ప్రభుత్వం పేదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వడంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులు పూర్తి అర్హత కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలను ఎదుర్కొనకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో తాగునీటి సరఫరా సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులకు వరి కొనుగోలు కేంద్రాల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులు తమ ధాన్యం అమ్మడానికి ఎలాంటి అవరోధాలు లేకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.