తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు రాబోతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అధికార కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకునే దశకు వచ్చింది. ఉగాది పండుగకు ముందు లేదా ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కించుకునే నాయకులు ఎవరు? ఇప్పటివరకు ఎవరు తప్పుకోవాలి? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఆశావాహుల అంచనాలు పెరిగాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిపాలనలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. అయితే కొన్ని కీలక నియోజకవర్గాలకు మంత్రి పదవులు దక్కకపోవడం, సామాజిక సమీకరణాల అంశం, రాజకీయ సమీకరణాలను బట్టి ప్రస్తుతం ఉన్న మంత్రులలో మార్పులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీలో కీలక భేటీ – కొత్త లిస్ట్ పై చర్చ
సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, తదితర అంశాలపై చర్చ జరిగింది. కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగిన ఈ భేటీ తెలంగాణ రాజకీయాలకు కీలకంగా మారనుంది. సమావేశానికి హాజరైన ముఖ్య నేతలు-రేవంత్ రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర కీలక నేతలు, తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం 6 మంత్రి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా నియామకాలు చేసే క్రమంలో సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం లభించనుందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రధానంగా బీసీ, ఎస్సీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బీసీ కోటాలో, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్సీ కోటాలో, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి, రెడ్డి కోటాలో, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ముస్లిం కోటాలో, ఎమ్మెల్సీ మీర్ అమీర్ అలీఖాన్ , విజయశాంతి (సినీ నటి, ఎమ్మెల్సీ) – ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని చర్చ ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశం ఉందని సమాచారం. కొండా సురేఖకు వ్యతిరేకంగా కొన్ని వివాదాలు రావడం, పార్టీ లోపలి రాజకీయాల్లో అంతర్గత ఒత్తిళ్లు పెరగడం. కాంగ్రెస్ హైకమాండ్ కొత్తవారికి అవకాశం కల్పించాలని భావించడం. ఈ కారణాల వల్ల కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం బలపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో పటిష్టంగా మార్చాలని భావిస్తున్నారు. అందుకే పాత మంత్రులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు.