మంత్రి కొండా సురేఖ మరోసారి తన ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లోకి నిలిచారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, నాయకుల వ్యవహారశైలి పట్ల తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మండిపడుతూ, బీఆర్ఎస్ నేతలు తప్పు చేయలేదని చెప్పుకుంటే ఆఫీసర్లను విదేశాలకు పంపేందుకు అవసరం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల ఉచ్చులో యువత పడకూడదని సురేఖ హితవు పలికారు.
తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకుంటూ బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ తల్లిని బంగారు ఆభరణాలతో ముస్తాబు చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ నాయకులు, తమ మాటలమీద నిలబడలేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన బీఆర్‌ఎస్ నేతలు, అధికారం కోల్పోయాక మాత్రమే ప్రజలను గుర్తు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడే భాష దారుణంగా ఉందని, ఆయన తండ్రి కేసీఆర్ ఎప్పుడూ అలాంటి మాటలు మాట్లాడలేదని తెలిపారు. ఫామ్‌హౌస్ పాలిటిక్స్ చేస్తూ, ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు కేటీఆర్‌కి లేదని అన్నారు. కౌశిక్ రెడ్డిని పిచ్చోడిగా అభివర్ణించిన సురేఖ, ఆయన అసెంబ్లీకి వస్తే గొడవ చేసే వ్యక్తి మాత్రమేనని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నదని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. గౌడల భద్రత కోసం పరికరాలు అందించిన మొదటి సీఎం రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. ముషీ ఉద్యమం గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం దారుణమని, ప్రజలు ఈసారి అగ్గిపెట్టి బీఆర్ఎస్‌ను తిప్పికొడతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీపై తిరిగి నమ్మకం ఉంచారని సురేఖ అన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆశించి రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు ఇచ్చారని అభిప్రాయపడ్డారు.