హైదరాబాద్ (ముషీరాబాద్): నేటితరం తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇనగంటి వెంకట్రావు రచించిన విలీనం- విభజన అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) అన్నారు. బషీర్ బాగ్ (Basheer Bagh) ప్రెస్ క్లబ్నందు విలీనం-విభజన (గతం- స్వగతం, మన ముఖ్య మంత్రులు) అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని చదివితే నాయకుల పరిపాలన, విజ్ఞానం, వారి గురించి అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. సమకాలీన రాజకీయ చరిత్ర తెలుసుకోవాలంటే తప్పకుండా విలీనం-విభజన పుస్తకం చదవాలని సూచించారు.

పత్రిక సమాజానికి దర్పణం లాంటిదని, ఈ సమాజంలో ఏం జరుగుతోందో ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత పత్రికలపై ఉందని పేర్కొన్నారు. కలానికి కులం లేదని, కేవలం కలానికి పదును మాత్రమే ఉండాలని, ప్రజాస్వామ్యంలో పత్రికలు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. తెలుగు భాషను బతికించేందుకు పత్రికలు కృషి చేయాలని, తెలుగు పత్రికలలో పనిచేసే పాత్రికేయులు తెలుగుభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని (give priority to Telugu language), వారు రాసే వాటిలో సాధ్యమైనంత వరకు ఇంగ్లీషు పదాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వ్యూస్ కోసం న్యూస్ చేయకూ డదని, దానికోసమే కాలమ్స్ ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయాలలో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అనే నాలుగు సీలు ఉండాలని, కానీ నేడు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీ, క్రిమినాలిటీ అనే నాలుగు సీలు రాజ్యమేలు తున్నాయని విమర్శలు వస్తున్నారు. నాయకులు కూడా భాష విషయంలో హుందా తనం ప్రదర్శించాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరి భావాలు ప్రతిబింబించే పుస్తకం విలీనం-విభజన అని, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఇనగంటి వెంకట్రావు, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్రెడ్డి, బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: