హైదరాబాద్: ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ఇప్పటివరకు 8.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గత సంవత్సరం ఇదే రోజున కొనుగోలు చేసిన 3.94 లక్షల మెట్రిక్ టన్నుల కంటే రెండింతలు ఎక్కువ అని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam) తెలిపారు. సోమవారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో(Tummala Nageswara Rao) కలిసి ఆయన జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ దేశ చరిత్రలోనే ఒకే సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవడం ఒక చరిత్ర సృష్టించడమని మంత్రి పేర్కొన్నారు.
Read also: Tirupati: ఎఫ్ఐఆర్ తరువాత నిందితుడిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏమిటి?

కొనుగోళ్ల వివరాలు, రైతుల చెల్లింపులు
ఇప్పటివరకు 3.95 లక్షల మె.ట సన్నాలు, 4.59 లక్షల మె.ట దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. మొత్తం రూ. 2,041.44 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా, గత ఏడాది కంటే ఇది రెట్టింపు. ఇందులో రూ. 832.90 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని కొనుగోళ్లు నమోదు తర్వాత 48 గంటల్లో చెల్లించనున్నట్లు తెలిపారు. సన్నాల బోనస్ కూడా గత ఏడాదితో పోలిస్తే ₹43.02 కోట్ల నుంచి ఈ సంవత్సరం ₹197.73 కోట్లకు పెరిగిందని చెప్పారు. జిల్లా కలెక్టర్లు కనీస మద్దతు ధర (MSP), బోనస్ రైతులకు వెంటనే చెల్లించేలా పర్యవేక్షణ చేయాలని మంత్రి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రక్షించడానికి తార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉంచి, మిల్స్‌కు వెంటనే తరలించాలని ఆదేశించారు.
పత్తి, మొక్కజొన్న సమస్యలు, కేంద్రానికి విజ్ఞప్తి
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి, మొక్కజొన్న,(corn) సోయాబీన్ కొనుగోళ్లపై కలెక్టర్లతో చర్చించారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు కొనుగోలు పరిమితిని 18.5 క్వింటాళ్ల నుండి 25 క్వింటాళ్లకు పెంచిన ప్రభుత్వ నిర్ణయంపై సంతృప్తిగా ఉన్నారని కలెక్టర్లు తెలిపారు. అయితే, పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ (CCI) నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్లు వివరించారు. దీనిపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు, పత్తి కొనుగోళ్ల పరిమితిని ఎకరాకు 7 క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్లకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. వర్షాల కారణంగా రంగు మారిన సోయాబీన్ పంటను కూడా కొనుగోలు చేయడానికి అనుమతించాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించామని తెలిపారు. మొంథా తుఫాన్ కారణంగా సుమారు 1.10 లక్షల ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు.
కీలకమైన నవంబర్ నెల, సమన్వయ కృషి
సమీక్ష ముగింపు సందర్భంగా ఇద్దరు మంత్రులు నవంబర్ నెలను పంటల కొనుగోళ్లకు అత్యంత కీలకమైన నెలగా పేర్కొన్నారు. తదుపరి నాలుగు వారాల్లో మొత్తం ధాన్యం కొనుగోళ్లలో 55 శాతం జరగనుందని, అందువల్ల అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి రాష్ట్ర లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ప్రతి గింజ, చెల్లించిన ప్రతి రూపాయి రైతుల పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: