కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) మరోసారి తన రాజకీయ స్పష్టతను ప్రదర్శించారు. ఆయన మాట్లాడుతూ, మంత్రిపదవిని వదులుకోవడానికైనా మునుగోడు ప్రజల కోసం పని చేయాలనే తపన ఉందని తెలిపారు. ఇటీవల నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి, అక్కడ జరిగిన ప్రసంగంలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మంత్రి పదవిని ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినా, తాను మునుగోడు ప్రజలపై ఉన్న అభిమానం వల్లనే అక్కడి నుంచే పోటీ చేశానని వివరించారు.
కాంగ్రెస్ నేతల సూచన తిరస్కరించిన రాజగోపాల్
రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి నేతలు ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని సూచించిందని గుర్తు చేశారు. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర పరాజయం ఎదురైనా, మునుగోడు ప్రజలు మాత్రం తనను గెలిపించారని గుర్తుచేశారు. ఇది తనకు ప్రత్యేక గౌరవం అని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలోనూ తాను మానసికంగా గెలిచానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రజల విశ్వాసమే నా బలం
తన రాజకీయ ప్రయాణంలో పదవులకు కన్నా ప్రజల విశ్వాసమే ముఖ్యమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ప్రజల ఆశీస్సులు, ఆదరణ తనకు ఎంతో విలువైనవని అన్నారు. అదే కారణంగా ఎల్బీనగర్‌లో మంత్రిపదవికి పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, మునుగోడు ప్రజలతో తన బంధం కారణంగా అక్కడి నుంచే మళ్లీ పోటీ చేశానని వివరించారు. తనకు మంత్రి పదవి వచ్చినా, ప్రజల ప్రేమతో సమానమయ్యే శక్తి దానికి లేదని స్పష్టంగా తెలిపారు.
Read ALso : Telangana Rains: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్