ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజోలు నియోజకవర్గంలో రైతులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కొబ్బరితోటలు ఎండిపోవడానికి తెలంగాణ నాయకుల దిష్టి తగలడమే కారణం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించినట్లుగా వచ్చిన వార్తలపై తెలంగాణ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తూ, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలా మాటలను వక్రీకరించడం సరికాదని కోరింది.
Read Also: TG: తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకుల నుంచి డిమాండ్లు వినిపించాయి.

సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరిక
తెలంగాణ (TG) రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అత్యంత తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ తన వివాదాస్పద వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని, తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను దుర్మార్గంగా కలిపినందుకు 60 ఏళ్లు తాము బాధపడ్డామని, ఫ్లోరైడ్ నీళ్లు తాగామని, తమ నిధులు, నీళ్లు, ఉద్యోగాలు తీసుకువెళ్లారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో సంపాదించిన పైసలతో విజయవాడ, వైజాగ్ మిగితా ప్రాంతాలను డెవలప్ చేసుకున్నారని ఆరోపించారు.
సినిమాటోగ్రఫీ మంత్రిగా చెపుతున్నానంటూ ఆయన హెచ్చరిస్తూ, పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్తేనే నైజాంలో రెండు రోజులైనా సినిమాలు ఆడుతాయనీ, లేదంటే సినిమా నడువదు అని మండిపడ్డారు. పవన్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారని, మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటారు, కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రెండు రాష్ట్రాల మధ్య సౌహార్ధ వాతావరణాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. “మీ సముద్రం నుంచి వచ్చే తుపాను మా రాష్ట్రాన్ని ముంచేస్తున్నా మేమెవరినీ తప్పుబట్టలేదు. అది ప్రకృతి అని భావించాం. కానీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా? కోనసీమపై మేమెందుకు దిష్టి పెడతాం?” అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని, ఇలాంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, (Chandrababu) బీజేపీ నాయకత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. రాజకీయం రెండున్నర గంటల సినిమా స్క్రిప్టు కాదని ఆయన హెచ్చరించారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్: కాంగ్రెస్ స్పందనపై విమర్శలు
కోనసీమపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత స్పందించిన కాంగ్రెస్ మంత్రులు, నాయకుల తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరని విమర్శించారు. కొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పది రోజులకు స్పందించడం హాస్యాస్పదమని జగదీశ్ రెడ్డి అన్నారు.
ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని, అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవుపలికారు. పవన్ కల్యాణ్ సినిమాలను ఆపుతామని ఇక్కడి మంత్రి (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి) కామెడీగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అభిమానం వేరు.. రాజకీయం వేరు అని, ప్రజలు తమ అభిమాన హీరో సినిమాలను ఆదరిస్తారని తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు పది రోజుల తర్వాత స్పందించిన తీరు చూస్తే ఇద్దరిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టుందని ఆయన విమర్శించారు. ఈ వివాదంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: