డైట్ టెండర్లలో భారీ మార్పులు
హైదరాబాద్ : ఇప్పటివరకు రాష్ట్రంలో పలు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్
ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇకపై అటువంటి ఘటనలు జరగకుండా, గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ సంక్షేమశాఖల అధ్వర్యంలో కొనసాగుతున్న ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, సాధారణ రెసిడెన్షియల్ స్కూల్స్లో (residential schools) భోజన టెండర్లను సెంట్రలైజ్డ్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర కేంద్రంలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్(పిఎంయు)ను ఏర్పాటు చేశారు. పిఎంయుకి చైర్మన్ గా ఎస్సి గురుకుల సొసైటీ సెక్రటరీ డాక్టర్ విఎస్ అలుగు వర్షిణి చైర్మన్ గా నియమించారు. ఇందులో భాగంగా ఆహార సంబంధిత వస్తువులు కొనుగోలు కోసం అన్ని గురుకులాలకు కామన్ మార్గదర్శకాలను రూపొందించారు.
నాణ్యమైన ఆహారం
ఇకపై ఈ మార్గదర్శకాల ఆధారంగానే టెండర్లను పిలవనున్నారు. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించనున్నారు. ఇప్పటి వరకు భోజన టెండర్ల (Meal tenders) ను పిలిచే సమయంలో తక్కువ ధరకు కోడ్ చేసిన వారికి టెండర్లను కట్టబెట్టేవారు. దీంతో నిత్యవసరాల వస్తువుల ధరలు పెరిగిన సమయంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో టెండర్దారులు సరైన చర్యలు తీసుకునేవారు కాదు. కానీ ఇకపై అటువంటి విధానం కాకుండా విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి భోజనానికి అవసరమైన వస్తువుల ధరలను అందులో తక్కువ ధరలు రేటు పెరిగిన సమయంలో ఉండే ఎక్కువ ధరలను సరాసరి చేసి ఏడాదిలో విద్యార్థుల భోజనాలకు అయ్యే ఖర్చును లెక్కకట్టి టెండర్ల కోసం ఫిక్స్డ్ రేట్ను నిర్ణయిస్తారు. ఇలా నిర్ణయించిన రేటుకి ఎక్కువ సంఖ్యలో టెండర్లు వస్తే వాటిల్లో లాటరీ ద్వారా టెండర్లను ఫైనల్ చేస్తారు.
స్వయం సహాయక మహిళా సంఘాలన్నింటినీ
అలాగే టెండర్లలో మహిళా సమాఖ్య సంఘాలు పాల్గొంటే వారికే ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. మహిళా సమాఖ్య అంటే ఒక గ్రామంలో ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలన్నింటినీ కలిపి గ్రామ మహిళా సమాఖ్యగా గుర్తిస్తారు. అలాగే మండలంలో ఉన్న సంఘాలను మండల మహిళా సమాఖ్య సంఘాలుగా గుర్తిస్తారు. మహిళా సమాఖ్యలు టెండర్లలో పాల్గొంటే వారికి ఈఎండి నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు వివిధ సొసైటీలకు వేరువేరుగా టెండర్ల ప్రక్రియ నిర్వహించేవారు. దీనివల్ల వేరు వేరు హాస్టల్లకు వేరు వేరు ధరలు వేస్తూ క్వాలిటీ విషయంలో, క్వాంటిటీ విషయంలో ఇబ్బందులు వస్తుండేవి. గతంలో నాణ్యత పాటించకుండా ఎవరు తక్కువ ధరకు టెండర్ వేస్తే వారికే టెండర్ వచ్చేది. ఈ విధానం వల్ల విద్యార్థులకు సరైన ఆహారం అందించడం సాధ్యమయ్యేది కాదు.

విద్యా సంవత్సరానికి
కానీ ఇప్పుడు అలా కాకుండా ఇకపై సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్దిష్టమైన ధరలను నిర్ణయించి ఆ ధరకు మాత్రమే టెండర్లను స్వీకరిస్తారు.దరఖాస్తు చేసుకున్న వారిలో డిప్ వేసి లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ విధానం ద్వారా కామన్ డైట్ను సమర్ధవంతంగా, పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుపడుతుంది. ఆహార వస్తువులతోపాటు యూనిఫామ్స్, విద్యార్థులకు అవసరమయ్యే బెడ్స్ ఇతర వస్తువులను కూడా ఇదే విధానంలో కొనుగోలు చేయనున్నారు. విద్యా సంవత్సరానికి ముందే యూనిఫామ్స్ తోపాటు విద్యార్థులకు కావలసిన వివిధ రకాల వస్తువులు ముందుగానే అందించేందుకుగాను ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. టెండర్ల మార్గదర్శకాల్లో భాగంగా, డైట్ ప్రొవిజన్స్ జిల్లా స్థాయిలో ప్రొక్యూర్ మెంట్ చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ(డిపిసి) ద్వారా టెండర్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
టెండర్లకు సంబంధించిన దరఖాస్తులను సేకరించనున్నారు
కూరగాయలు, పండ్లు కొనుగోలు కోసం మండల స్థాయిలోనూ అలాగే చికెన్, మటన్ కొనుగోలు కోసం మండల స్థాయిలో ఒక యూనిట్గా ఎంపిక చేసుకుని టెండర్ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 31న టెండర్లకి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు. ఆగస్టు 14 వరకు టెండర్లకు సంబంధించిన దరఖాస్తులను సేకరించనున్నారు. ఆగస్టు 18 నుంచి 22 వరకు టెండర్దారుల దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఆగస్టు 23న టెండర్లలో అర్హులైన వారి పేర్లను ప్రకటిస్తారు. ఆగస్టు 28న వర్క్ ఆర్డర్లను జారీ చేస్తారు. కేటరింగ్ కాంట్రాక్ట్ సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్టు ప్రకటించారు.
స్పాట్ అడ్మిషను
గురుకులాల్లో కామన్ ప్రొక్యూర్మెంట్తో పాటు ఎస్సి గురుకుల సోసైటీకి సంబంధించిన అడ్మిషన్లపై సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ విఎస్ అలగు వర్షిణి మంగళవారం తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని.. 5 నుండి 9వ తరగతి వరకు సీట్లు భర్తీ అయినట్టు తెలిపారు. మెరిట్రిస్ట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేశామన్నారు. గురుకులాల్లోసీట్లు ఇప్పిస్తామనే దళారులను నమ్మి మోసపో వద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకువిజప్తి చేశారు. 31న జూనియర్ కాలేజీల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి స్పాట్ అడ్మిషను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఖాళీల వివరాలను నేడు(జులై30న) వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. బోర్డు సభ్యులకు 2 శాతం సీట్ల భర్తీకి అవకాశం ఉంటుందని.. వాటిని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న పిల్లలను చదివించడానికి ఉపయోగిస్తామని సెక్రటరీ స్పష్టం చేశారు.
తెలంగాణలో తొలి రెసిడెన్షియల్ స్కూల్ ఏది?
తెలంగాణలో తొలి రెసిడెన్షియల్ స్కూల్ టెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్, సర్వాయిల్. ఈ పాఠశాలను 23 నవంబర్ 1971న అప్పటి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్ర ప్రభుత్వం స్థాపించింది.
భారతదేశంలో గూరుకులాలు ఎన్ని ఉన్నాయి?
వెదికాన్సెప్ట్స్ ఏప్రిల్ 2022లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశం మొత్తం 4500కు పైగా గూరుకులాలు ఉన్నాయి. అందులో 2612 గూరుకులాలపై మాత్రమే పూర్తి సమాచారం లభ్యమైందని, మిగతా వేదిక్ గూరుకులాల వివరాలను సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: midazolam injection: ఆపరేషన్ల సమయంలో వాడే మత్తు ఇంజక్షన్లు బహిరంగ మార్కెట్లో విక్రయం