ములుగు జిల్లా రద్దు అవుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క స్పందించారు. ఈ వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. ములుగు (Mulugu) జిల్లా ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీనే పోరాడిందని గుర్తు చేస్తూ, తామే ఎందుకు రద్దు చేస్తామని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ములుగు జిల్లాను రద్దు చేయదని స్పష్టం చేశారు. జిల్లాల రద్దు అనే మాటే లేదని, కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Enforcement Department : రాజ్యాంగ వ్యవస్థలు విమర్శలకు అతీతంగా ఉండాలి

Seethakka gives clarity on the dissolution of Mulugu district
గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు ఇబ్బందులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు సమయంలో శాస్త్రీయంగా ఆలోచించలేదని మంత్రి సీతక్క విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, పరిపాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా సరిహద్దులు నిర్ణయించారని తెలిపారు. దీని వల్ల సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కొన్ని మండలాల్లోని గ్రామాలు పక్కనే ఉన్న మరో జిల్లాకు వెళ్లిపోవడంతో, రెవెన్యూ, పోలీస్ వ్యవహారాల్లో గందరగోళం ఏర్పడుతోందని వివరించారు. ఒక మండలం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలన్నది ప్రజల సహజ కోరిక అని ఆమె పేర్కొన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం చిన్న మార్పులే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనను మెరుగుపరచేందుకు మాత్రమే జిల్లాల సరిహద్దుల్లో చిన్నపాటి, శాస్త్రీయ మార్పులు చేయాలని సూచించారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. ఇది జిల్లా రద్దుకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. ములుగు జిల్లా ఏర్పాటుతో అసంతృప్తి చెందిన కొందరే కావాలనే పుకార్లు పుట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లా అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేటాయిస్తుందని, జిల్లా యథాతథంగా కొనసాగుతుందని ఆమె భరోసా ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: