హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు సంబంధించి షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. నేడు గ్రూప్-1,ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్ తెలిపింది.మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసేందుకు కమిషన్ తుది పరిశీలన నిర్వహిస్తోంది. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.

ఫలితాల విడుదల షెడ్యూల్
.మార్చి 10 – గ్రూప్-1 ఫలితాల విడుదల, ప్రొవిజినల్ మార్కుల వెల్లడింపు.
.మార్చి 11 – గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
.మార్చి 14 – గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల.
.మార్చి 17 – హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాల ప్రకటన.
.మార్చి 19 – ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ తుది ఫలితాల విడుదల.
.అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన గ్రూప్-1 ఫలితాల విడుదల అనంతరం చేపట్టనున్నారు.
ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా
గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది హాజరయ్యారు. ఫలితాల వెల్లడిలో భాగంగా మొదట ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది.