బతుకమ్మ (Bathukamma Sarees) పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి చీరల పంపిణీ విషయంలో కొత్త మార్పులు చేస్తూ, ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ కానుక అందించాలని నిర్ణయించింది. “అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక” పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది.ఇప్పటివరకు ఆధార్ ఉన్న 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీర ఇచ్చే విధానం ఉండేది. కానీ రేవంత్ సర్కార్ కొత్త విధానం తీసుకొచ్చింది. ఇకపై కేవలం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులకే చీరలు ఇస్తారు. ఒక్కొక్కరికీ ఒకటి కాకుండా రెండేసి చేనేత చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పథకం అమలు ఎలా?
ఈ నెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. అదే సందర్భంలో “ఇందిరా మహిళా శక్తి” పథకం కింద ఈ చీరల పంపిణీ చేపడుతున్నారు. పట్టణాల్లో మెప్మా, గ్రామాల్లో డీఆర్‌డీఓ ద్వారా సభ్యుల వివరాలు సేకరిస్తున్నారు. అర్హత గల సభ్యురాలిని తప్పక గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు.ప్రభుత్వం చీరల తయారీ బాధ్యతను చేనేత సహకార సంఘాలకు అప్పగించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోనే తొమ్మిది లక్షలకు పైగా చీరలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15వ తేదీ లోపు చీరలు అన్ని జిల్లాలకు చేరేలా కసరత్తు చేస్తున్నారు. అయితే పండుగ సమయం దగ్గరగా రావడంతో పంపిణీ సకాలంలో పూర్తి చేయడం సవాలుగా మారింది.
గతంలో వచ్చిన విమర్శలు – ఈసారి జాగ్రత్తలు
గతంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల నాణ్యతపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. నాసిరకం చీరలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసి, కొన్నిచోట్ల వాటిని దహనం చేశారు. ఆ ఘటనల వల్ల ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నది. అందుకే ఈసారి నాణ్యమైన చేనేత చీరలనే పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈసారి చీరల పంపిణీ ద్వారా మహిళల విశ్వాసం గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పద్ధతితో ముందుకు రావడం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా గ్రామీణ స్థాయిలో పార్టీ బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి ఊతమివ్వడమే కాకుండా, డ్వాక్రా మహిళలకు ప్రత్యేక కానుక ఇవ్వాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Read Also :