Telangana Govt : గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. బీమా సదుపాయం, ఇతర హక్కులను కల్పించేలా తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదాను తయారు చేసింది. అందులో పొందుపరిచిన అంశాలను అధికారులు నిన్న సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ ముసాయిదాకు సీఎం పలు మార్పులు చేర్పులను సూచించారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వటంతో పాటు కంపెనీలు, అగ్రిగేటర్లకు మధ్య సమన్వయం డేలా కొత్త చట్టం ఉండాలని సీఎం అభిప్రాయం. దానికి తగ్గట్టు బిల్లు ముసాయిదాను తయారు చేసి ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయాన్ని సేకరించి గిగ్ వర్కర్ల ఉద్యోగానికి భద్రత కల్పించేలా చట్టాన్ని తయారు చేయాలని ఆదేశించారు.

మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి
ప్రస్తుతం తెలంగాణలో 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పని చేస్తున్నారని ప్రభుత్వ అంచనా. అందుకే వారికి భద్రత కోసం అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉందని రేవంత్ రెడ్డి ఆలోచన. ఆ తర్వాత పకడ్బందీగా ఈనెల 25న బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలని చెప్పారు సీఎం. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి మే డే రోజున ఈ బిల్లును అమల్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం
గిగ్ వర్కర్లు, ప్లాట్ ఫామ్ వర్కర్ల భద్రతకు చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలోనే మొదటి సారిగా వారికి ప్రమాద బీమాను అమలు చేశారు. గిగ్, ప్లాట్ ఫాం వర్కర్లు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా అందేలా 2023 డిసెంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కొత్తగా అమలు చేసే చట్టం కూడా దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా ఉండాలని అధికారులకు సూచించారు.
Read Also: పెళ్లి చేసుకున్న అఘోరీ, శ్రీవర్షిణి