తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగింది. పలు జిల్లాల్లో ఇళ్లు, పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తాజా సమీక్ష నిర్వహించి, బాధితులకు సత్వర సహాయ చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
వర్షాలు, వరదల కారణంగా ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా తోడుగా నిలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, ప్రతి మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించనున్నారు. అంతేకాకుండా, వరదల్లో మృతి చెందిన పశువులకు కూడా పరిహారం అందించనున్నట్టు తెలిపారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు
మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, అధికారులు ముందస్తుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కలెక్టర్లు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. చెరువులు, ఆనకట్టలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
కేంద్ర నిధులపై అసంతృప్తి
గత ఏడాది తెలంగాణ(Telangana)లో వచ్చిన భారీ వర్షాల నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇప్పటికీ అందలేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని అధికారులను ఆదేశించారు.
చెరువులపై సమగ్ర అధ్యయనం అవసరం
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులను వెంటనే నోటిఫై చేయాలని సీఎం సూచించారు. చెరువుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదికలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పంట నష్టంపై పూర్తి అంచనాతో కూడిన నివేదికలను తక్షణమే సమర్పించాలని తెలిపారు.
ఎస్డీఆర్ఎఫ్ పనితీరుకు సీఎం ప్రశంస
గత సంవత్సరం ఏర్పాటు చేసిన SDRF (State Disaster Response Force) ఈసారి వరదల సమయంలో సమర్థంగా స్పందించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. విపత్తుల సమయంలో ఇటువంటి శక్తివంతమైన బృందాల అవసరం ఎంతైనా ఉందని ఆయన హితవు పలికారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: