కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా?
హైదరాబాద్: రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నా. అయితే రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు.

చేతకాని, దమ్ములేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం
అయితే ఇలాంటి బెదిరింపులకు నేను భయపడను. నేను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్టు రుజువు చూపించాలని సవాల్ చేస్తున్నా. చేతకాని, దమ్ములేని సీఎం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెట్రోకి సంబంధించి మొన్న ప్రతిపాదనలు పంపారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఏమాత్రం అవగాహన లేకుండా దుందుడుకు వైఖరితో వ్యవహరిస్తున్నారు. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు అని నెపం నా మీదకు నెడుతున్నారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సీఎం ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి
కాగా, నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రధానితో సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ. మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.