తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth ), దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కె.వి.పి. రామచంద్రరావుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ తరానికి వైఎస్ ఒకరు, కేవీపీ ఒకరు మాత్రమే ఉంటారని కొనియాడారు. కె.వి.పి. లాంటి నిస్వార్థ నాయకుడు తనకు ఎక్కడా కనిపించలేదని అన్నారు. కె.వి.పి. లాగా ఉండాలంటే సర్వం త్యాగం చేయాలని, అటువంటి త్యాగనిరతి ప్రతి ఒక్కరిలో ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయాల్లో అరుదైన లక్షణమని ఆయన పేర్కొన్నారు.
‘నా కుర్చీలో కూర్చుంటామంటారు’
రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కొందరు నాయకులు నా దగ్గరికి వచ్చి కేవీపీ(KVP)లా ఉంటామంటారు. కానీ ఎవరినైనా మొదటి వారం ఆఫీస్ లోపలికి రానిస్తే, రెండో వారం నా కుర్చీలోనే కూర్చుంటామంటారు. ఇది నా అనుభవంతో చెబుతున్నా,” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఇది పరోక్షంగా కొంతమంది నాయకుల స్వార్థపూరిత మనస్తత్వాన్ని విమర్శించినట్లుగా ఉంది.
వైఎస్సార్, కేవీపీల అనుబంధం
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావుల మధ్య ఉన్న అనుబంధం ప్రజలకు తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, కేవీపీ ఆయనకు కుడి భుజంగా వ్యవహరించారు. ఎలాంటి పదవులను ఆశించకుండా, వైఎస్సార్‌కు పూర్తి మద్దతుగా నిలబడ్డారు. రేవంత్ రెడ్డి ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయాల్లో స్వార్థం లేకుండా పనిచేసేవారు చాలా తక్కువ మంది ఉంటారని, అందులో కేవీపీ ఒకరని మరోసారి స్పష్టం చేశారు.