ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం – మెట్రో స్కైవాక్ ప్రణాళిక
హైదరాబాద్ నగరంలో జటిలంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు పరిష్కారంగా మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మెట్రో స్టేషన్ల నుండి వాటి సమీపంలోని వాణిజ్య, నివాస భవనాల సముదాయాలకు పైవంతెనలు (స్కైవాక్స్) నిర్మాణాన్ని ప్రోత్సహించాలి అని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమీషనర్ శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ రెండు రోజుల క్రితం హెచ్ఎండిఏ స్వర్ణజయంతి భవన్ లో నిర్వహించిన కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్రణాళికా సమావేశంలో నిర్ణయించారు.
ఇప్పటికే నిర్మించిన మెట్రో స్కైవాక్ లు
ఎల్ అండ్ టీ వారు ఇప్పటికే పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుండి వారు అభివృద్ధి చేసే మాల్స్‌కు పైవంతెనలు నిర్మించి, మెట్రో ప్రయాణీకులు నేరుగా ఈ వాణిజ్య సముదాయాలకు చేరుకునే సౌలభ్యాన్ని కల్పించారు. అలాగే జేబీఎస్, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్ లను కలుపుతూ ప్రయాణీకులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ లు నిర్మించారు.
రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లోని 11 టవర్లలో పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థల ఉద్యోగులు సులభంగా చేరుకునేందుకు రహేజా వారు అధునాతన స్కైవాక్‌ను నిర్మించారు. ఇది అనేక ఆధునిక సౌకర్యాలతో రూపొందించబడింది.
ఉప్పల్ వలయాకారపు స్కైవాక్ ప్రయోజనాలు
హెచ్ఎండీఏ వారు ఉప్పల్ మెట్రో స్టేషన్‌ను ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని రహదారులను కలిపే విధంగా వలయాకారపు రోటరీ స్కైవాక్ నిర్మించారు. ఈ మెట్రో ప్రయాణీకులకు, రోడ్లు దాటే పాదచారులకు ఎంతో ఉపయోగపడుతోంది.
ప్రైవేట్ సంస్థల నుండి మంచి స్పందన
మెట్రో స్టేషన్ల నుండి నివాస సముదాయాలకు పైవంతెనలు నిర్మించడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు, వాణిజ్య సముదాయాల నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్‌కు స్కైవాక్ నిర్మాణంలో ఉంది. అలాగే ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి వాసవీ ఆనందనిలయం నివాస సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు.
వాసవీ ఆనందనిలయం 25 ఎకరాల విస్తీర్ణంలో 12 టవర్లుగా నిర్మించబడుతుంది, ఒక్కొక్క టవర్ 33 అంతస్తులతో ఉంటుంది. ఇది ఇక్కడ నివసించే కుటుంబాలకు మెట్రో స్టేషన్‌కు సులభంగా చేరుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
మరిన్ని మెట్రో స్టేషన్లకు స్కైవాక్ ప్రణాళిక
ఇంకా నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల నుండి స్కైవాక్ నిర్మాణానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శ్రీ కేవీబీ రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్ల నుండి ఇటువంటి స్కైవాక్ నిర్మించదలచిన ప్రైవేట్ సంస్థలు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి శ్రీ కె.వి. నాగేంద్ర ప్రసాద్‌ను 9900093820 నంబర్‌లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
మెట్రో స్టేషన్ల వద్ద రహదారి దాటే సౌకర్యం
హైదరాబాద్ మెట్రో 69 కిలోమీటర్ల మేర విస్తరించిన తొలి దశలో 57 మెట్రో స్టేషన్లలో ప్రతి స్టేషన్ వద్ద రహదారికి రెండు వైపులా రోడ్డు దాటే సౌకర్యం ఉంది. వీటిని మెట్రో ప్రయాణీకులే కాకుండా పాదచారులందరూ వినియోగించుకోవచ్చు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకుని ప్రమాదాల బారిన పడకుండా రోడ్డు సురక్షితంగా దాటాలని మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.