Rythu Bima : ప్రస్తుత 2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈనెల 14 నుంచి అమలు కానుంది. దీనికి సంబంధించి వ్యవసాయశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనల మేరకు కొత్త రైతుల నమోదు, రెన్యూ వల్స్ చేపట్టాలని క్షేత్ర స్థాయి అధికారులకు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 5వ తేదీ వరకు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతుల్లో బీమాకు అర్హులైన వారిని వ్యవసాయశాఖ గుర్తించనుంది. భూ భారతిలో నమోదై, సీసీఎల్ ఎల్ఎలో నమోదైన భూములు కలిగిన రైతుల్లో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు, ఆర్ ఎఫ్ ఆర్ పట్టాదారులకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అందించే డాటా ఆధారంగా రైతుబీమా కల్పించనున్నారు. ఈ మేరకు కొత్త వారందరూ ఈనెల 13లోగా క్షేత్ర స్థాయిలో ఏఈవోలు, ఏవోలతో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. 2025-26 రైతు బీమా కోసం క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి రైతు బీమా పోర్టల్లో అధికారులు అప్లోడ్ చేయనున్నారు. రైతు బీమా పథకానికి అర్హులై ఉండి అప్లయ్ చేసుకోని వారికి సైతం తాజాగా దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అయితే, ఐదెకరాలలోపు భూమి ఉండి కూడా గతంలో ఆప్లయ్ చేసుకోని రైతులకే ఈ దఫా అవకాశం కల్పిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తు (Application) చేసుకున్నవారు, గతంలో అర్హత ఉండి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారందరూ కలిపి దాదాపు 2 లక్షల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా.
కొత్త బీమా సంవత్సరంలో ఇప్పటికే రైతు బీమా కలిగిన లబ్దిదారులైన రైతుల రెన్యూవల్స్క సంబంధించి డేటా పరిశీలన ఈనెల 12లోగా పూర్తి చేయాలని వ్యవసాయశాఖ క్షేత్ర స్థాయి అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 60 సంవత్సరాలు నిండిన వారిని తొలగించి మిగిలిన అర్హులైన రైతులకు బీమాను రెన్యూవల్ చేయాలని సూచించారు. రైతు బీమా పోర్టల్లో రెన్యూవల్ అప్లోడ్ ప్రక్రియ పూర్తి అయిన వారికి ఈనెల 14వ తేదీ నుంచి కొత్త బీమా అమలు చేయనున్నారు. ఒకే రైతుకు రెండు అంతకంటే ఎక్కువ గ్రామాల్లో భూమి పట్టా పాస్బుక్ కలిగి ఉన్నప్పటికీ ఒకే పాలసీకి వర్తింపు ఉంటుందని తాజా మార్గదర్శకాల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే, భూ భారతిలో జూన్ 5వ తేదీ వరకు ఫట్టా పాస్ట్బుక్, సీసీఎల్ఎలో నమోదైన రైతులకు మాత్రమే రైతు బీమా వర్తింపు ఉంటుందని అధికారులు తెలిపారు. సీసీఎల్ఎలో లేని భుములున్న రైతులకు బీమా వర్తింపు ఉండదని తాజా సర్క్యూలర్ లో స్పష్టం చేశారు. రైతు బీమా కలిగిన రైతులు సహజ మరణమైనా, ఏ విధంగా చనిపోయినా సదరు రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందుతుందని వ్యవసాయశాఖ పేర్కొంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :