తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఒలింపిక్స్(Olympics )లో పతకాలు సాధించే రాష్ట్ర క్రీడాకారులకు మరింత భారీ ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. గతంలో రూ.2 కోట్లుగా ఉన్న ఒలింపిక్ గోల్డ్ మెడల్ రివార్డ్‌ను ఇప్పుడు రూ.6 కోట్లకు పెంచారు. ఇది రాష్ట్రం నుండి పాల్గొంటున్న క్రీడాకారులకు భారీ ఊరటగా మారనుంది.
ఆసియా, కామన్వెల్త్ క్రీడలకు భారీ గౌరవం
ఒలింపిక్స్‌తో పాటు ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌లో విజేతలకూ భారీగా నగదు ప్రోత్సాహకాలు పెంచారు. ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలిచిన వారికి ఇప్పటివరకు రూ.30 లక్షల బహుమతి ఉండగా, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.3 కోట్లకు పెంచారు. అలాగే ఆసియా గేమ్స్‌లో సిల్వర్‌కు రూ.1.5 కోట్లు, బ్రాంజ్‌కు రూ.75 లక్షలు ఇవ్వనున్నారు. కామన్వెల్త్ గేమ్స్ గెలుపుదారులకు గోల్డ్‌కు రూ.1.5 కోట్లు, సిల్వర్‌కు రూ.75 లక్షలు, కాంస్య పతకదారులకు రూ.50 లక్షల నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ క్రీడా అభివృద్ధికి నూతన దిశ
ఈ ప్రకటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా నిర్ణాయకమైన అడుగు వేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ క్రీడామైదానాల్లో తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు ఈ నగదు ప్రోత్సాహకాలు దోహదపడతాయని భావిస్తున్నారు. యువ క్రీడాకారుల్లో స్పూర్తి నింపేందుకు, వారు మరింత ప్రోత్సాహంతో ప్రాక్టీస్ చేసి విజయాల కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రోత్సాహకాలు పెంచినట్లు అధికారులు తెలిపారు.
Read Also : Vande Bharat Express: వందే భారత్ ట్రైన్ లో వాటర్ లీకేజీ